Papad: కలర్ పాపడ్ తింటున్నారా.! బీ కేర్‌ఫుల్.. సంచలన నిజాలు ఇవిగో!

Papad: కృత్రిమ రంగులతో తయారుచేసే కలర్ పాపడ్లు, ఫ్రైయమ్స్‌పై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించింది.

Ravi
By Ravi
Published on: 30 July 2026 7:12 PM IST
Papad
X

Papad: కలర్ పాపడ్ తింటున్నారా.! బీ కేర్‌ఫుల్.. సంచలన నిజాలు ఇవిగో!

Papad: పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినే రంగురంగుల పాపడ్లు, ఫ్రైయమ్స్ ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు కలిగిస్తున్నాయని ఆహార భద్రత అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆకర్షణీయమైన రంగుల్లో కనిపించే ఈ చిరుతిండ్లలో మోతాదుకు మించి కృత్రిమ రంగులు ఉపయోగిస్తున్నట్లు తేలడంతో తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సింథటిక్ రంగులతో తయారుచేసే ఇటువంటి కలర్ పాపడాల ఉత్పత్తి, విక్రయాలపై తమిళనాడు ప్రభుత్వం ఇటీవల పూర్తి స్థాయిలో నిషేధం విధించింది. మార్కెట్లో లభించే ఇటువంటి రంగుల చిరుతిళ్ల తయారీలో ఉపయోగిస్తున్న రసాయనాలు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని వైద్య నిపుణులు వెల్లడించారు.

రసాయనాలతో కూడిన సింథటిక్ రంగులు ఉపయోగించడం వల్ల ఈ పాపడ్లు సులభంగా జీర్ణం కావని ఆహార భద్రత అధికారులు తెలిపారు. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సంబంధిత సమస్యలతో పాటు కిడ్నీ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకూడా, ఇటువంటి రసాయన రంగులను దీర్ఘకాలంలో తీసుకోవడం వల్ల క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు బారిన పడే అవకాశం ఉందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు వీటిని ఎక్కువగా ఇష్టపడి తినడం వల్ల వారి ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోందని అధికారులు వివరించారు.

కాగా, ఈ కృత్రిమ రంగులు కలిపిన ఆహార పదార్థాల వల్ల పిల్లల్లో అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ లాంటి మానసిక నాడీ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు ఏకాగ్రత లోపించడం, అతిగా ప్రవర్తించడం లాంటి లక్షణాలకు ఈ ఆహార పదార్థాలు కూడా కారణమవుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో పిల్లలకు ఇటువంటి రంగుల చిరుతిళ్లను దూరంగా ఉంచాలని, కేవలం ఇంట్లో సహజ సిద్ధంగా తయారుచేసిన ఆహార పదార్థాలకే ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story