Tamil Nadu: రజనీకాంత్‌తో కలిసి అన్నామలై కొత్త పార్టీ?.. తమిళనాట జోరుగా ప్రచారం!

Tamil Nadu: తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది.

Arun Chilukuri
Updated on: 3 Jun 2026 11:42 AM IST
Tamil Nadu
X

Tamil Nadu: రజనీకాంత్‌తో కలిసి అన్నామలై కొత్త పార్టీ?.. తమిళనాట జోరుగా ప్రచారం!

Tamil Nadu: దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడు రాజకీయాలు అత్యంత వేగంగా మలుపు తిరుగుతున్నాయి. విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీయే (NDA) కూటమిలో చీలికలు మొదలవగా.. తాజాగా ఊహించని విధంగా బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కే. అన్నామలై (Annamalai) పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ పరిణామం తమిళనాడు కమలదళంలో తీవ్ర కలకలం రేపుతోంది.

నిన్న అత్యవసరంగా ఢిల్లీ వెళ్లిన అన్నామలై.. అక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్, కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి బి.ఎల్‌.సంతోష్ మరియు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలను వరుసగా కలిశారు. అనంతరం నితిన్‌ నబీన్‌కి తన అధికారిక రాజీనామా లేఖను సమర్పించారు. అన్నామలై వైఖరితో తమిళనాడు బీజేపీలోనూ భారీ చీలిక వచ్చే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అన్నామలై తన భవిష్యత్తు కార్యాచరణపై నేడో, రేపో అధికారికంగా ఒక నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. ఆయన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ (Rajinikanth)తో కలిసి ఉమ్మడిగా కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారంటూ తమిళనాట విస్తృత ప్రచారం జరుగుతోంది.

అన్నామలై తీసుకున్న ఈ సంచలన నిర్ణయానికి మద్దతు తెలుపుతూ తమిళనాడు వ్యాప్తంగా ఆయన అనుచరులు, అభిమానులు భారీగా పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. 'సింగం' అన్నామలై అడుగుజాడల్లోనే నడుస్తామంటూ క్యాడర్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. అన్నామలై కొత్త పార్టీ వైపు వెళ్తే తమిళనాడులో సరికొత్త రాజకీయ సమీకరణాలు మారడం ఖాయంగా కనిపిస్తోంది.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story