Tamil Nadu: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీకొని ఐదుగురు మృతి!

Tamil Nadu: తమిళనాడులోని మదురైలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Arun Chilukuri
Published on: 13 July 2026 11:30 AM IST
Tamil Nadu
X

Tamil Nadu: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీకొని ఐదుగురు మృతి!

Tamil Nadu: తమిళనాడు రాష్ట్రంలో సోమవారం తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బస్సులు ఎదురెదురుగా వచ్చి అత్యంత వేగంగా ఢీకొనడంతో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మదురై జిల్లాలోని కొట్టంపట్టి సమీపంలో ఈ విషాదకర ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రైవేటు బస్సు ఒకటి చెన్నై నుంచి మార్తాండం వైపు వెళ్తుండగా, మదురై జిల్లా కొట్టంపట్టి సమీపంలో డ్రైవర్ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయాడు. దీంతో అతివేగంగా ఉన్న ఆ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి డివైడర్‌ను దాటి అవతలి వైపునకు దూసుకెళ్లింది. సరిగ్గా అదే సమయంలో తిరుచిరాపల్లి వైపు వెళ్తున్న ప్రభుత్వ బస్సు ఎదురుగా రావడంతో ప్రైవేట్ బస్సు దానిని బలంగా ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న ప్రయాణికుల బస్టాప్ షెడ్డులోకి దూసుకెళ్లి ఆగింది.

ప్రైవేటు బస్సు అతివేగంగా వచ్చి బలంగా ఢీకొట్టడంతో ప్రభుత్వ బస్సు రహదారిపైనే బోల్తా పడింది. ఈ ఘోర ప్రమాదంలో బస్సుల్లో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులతో పాటు, ఆ సమయంలో బస్టాప్‌ షెడ్డులో నిద్రిస్తున్న మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదం కారణంగా రెండు బస్సుల్లోని మరో 40 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన 40 మందిని తక్షణమే చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, దీనివల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు మరియు పోలీసులు వెల్లడించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story