CM Vijay: మహిళలను అవమానిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది
CM Vijay: మహిళలను అవమానించేలా మాట్లాడితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని తమిళనాడు సీఎం విజయ్ హెచ్చరించారు.
CM Vijay: మహిళలను అవమానిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది
CM Vijay: మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీవ్రంగా హెచ్చరించారు. భావప్రకటనా స్వేచ్ఛను ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలని, మహిళలను కించపరిచేలా మాట్లాడడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. నటి త్రిషను ఉద్దేశించి ఉదయనిధి స్టాలిన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రంలో దుమారం కొనసాగుతున్న వేళ.. శాసనసభలో సీఎం ఈ అంశంపై పరోక్షంగా స్పందించి విపక్షాల విమర్శలకు దీటుగా బదులిచ్చారు.
శాసనసభలో సీఎం విజయ్ మాట్లాడుతూ.. ‘‘కొందరు మాట్లాడేటప్పుడు ద్వంద్వార్థం వచ్చే పదాలను ఉపయోగిస్తున్నారు. దాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. మనందరి ఇళ్లలోనూ తల్లి, అక్కా చెల్లెళ్లు ఉన్నారు. మహిళలను అవమానించేలా మాట్లాడితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది’’ అని హెచ్చరించారు. ఉదయనిధి స్టాలిన్ పేరు ప్రస్తావించకుండానే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదే అసెంబ్లీలో గతంలో జయలలిత ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారో అందరూ చూశామని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరికీ మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందని, కానీ తాము మాట్లాడే ప్రతి మాటను ప్రజలు గమనిస్తుంటారనే స్పృహ ఉండాలని హితవు పలికారు.
ఇక రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణపై వస్తున్న విమర్శలకు సీఎం బదులిస్తూ.. పోలీస్ వ్యవస్థ కేవలం అరెస్టులు చేయడానికే పరిమితం కాదని, అది రాష్ట్ర అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. పోలీసులు చట్టాన్ని పాటించే వారికి మిత్రులుగా, ఉల్లంఘించే వారికి శత్రువులుగా ఉంటారని చెప్పారు. రాజకీయ నాయకులు కానీ, అధికారులు కానీ పోలీసుల విధుల్లో జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం విమర్శలపై దృష్టి పెట్టదని, అభివృద్ధికి పెద్దపీట వేయడమే తమ ప్రధాన లక్ష్యమని తేల్చిచెప్పారు.
అవినీతిని ఎంతమాత్రం సహించేది లేదని సీఎం విజయ్ పునరుద్ఘాటించారు. అధికారులు అవినీతికి పాల్పడితే వారి కుటుంబాలు కూడా సమాజంలో తలదించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. లాకప్ నేరాలు సాధారణమైనవి కాదని పేర్కొన్న ఆయన.. ఇలాంటి ఘటనలపై మేజిస్ట్రేట్ ద్వారా పారదర్శక విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.




