Tamil Nadu: సీఎం విజయ్ రియల్ హీరో మార్క్.. సైగలతో వేడుకున్న 24 గంటల్లోనే దివ్యాంగుడికి ప్రభుత్వ ఉద్యోగం!

Tamil Nadu: తమిళనాడు సీఎం విజయ్ గొప్ప మనసు. సైగలతో వేడుకున్న దివ్యాంగ యువకుడికి 24 గంటల్లోనే ప్రభుత్వ ఉద్యోగం ప్రదానం.

Arun Chilukuri
Published on: 30 Oct 2026 3:28 PM IST
Tamil Nadu
X

Tamil Nadu: సీఎం విజయ్ రియల్ హీరో మార్క్.. సైగలతో వేడుకున్న 24 గంటల్లోనే దివ్యాంగుడికి ప్రభుత్వ ఉద్యోగం!

Tamil Nadu: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన ప్రత్యేక మానవతా దృక్పథంతో ఓ దివ్యాంగ యువకుడి జీవితంలో కొత్త వెలుగులు నింపారు. నిరుద్యోగంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న తనకు ఏదైనా ఉద్యోగం కల్పించి ఆదుకోవాలంటూ సైగల ద్వారా విజ్ఞప్తి చేసిన ఓ మూగ, చెవిటి యువకుడికి కేవలం 24 గంటల వ్యవధిలోనే ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాన్ని అందించి తన ఉదారతను చాటుకున్నారు. ముఖ్యమంత్రిని కలిసిన మరుసటి రోజే చేతికి అపాయింట్‌మెంట్ ఆర్డర్ అందడంతో ఆ యువకుడితో పాటు కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

చెన్నైలోని గిండిలో ఉన్న ప్రభుత్వ వృత్తివిద్యా శిక్షణ సంస్థలో బుధవారం ఉదయం జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్యమంత్రి విజయ్ హాజరయ్యారు. అదే సమయంలో దినేశ్ అనే దివ్యాంగ యువకుడు ధైర్యం చేసి సీఎం వద్దకు వెళ్లి ఒక చిన్న విజ్ఞప్తి పత్రాన్ని అందించాడు. తాను నిరుద్యోగినని, జీవనం సాగించడం చాలా కష్టంగా ఉందని, ఏదైనా ఉపాధి కల్పించి ఆదుకోవాలని అందులో కోరాడు. మాటలు రాకపోవడంతో తన దయనీయ పరిస్థితిని సైగల ద్వారా ముఖ్యమంత్రికి వివరించాడు. దినేశ్ చెప్పిన విషయాలను ఎంతో ఓపికగా, శ్రద్ధగా అర్థం చేసుకున్న సీఎం విజయ్ అతడికి తప్పకుండా సాయం చేస్తానని హామీ ఇచ్చారు. యువకుడు ఇచ్చిన కాగితాన్ని భద్రంగా తన కోటు జేబులో పెట్టుకుని అక్కడి నుంచి నేరుగా సచివాలయానికి వెళ్లారు.

సాధారణంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో వేలాది మంది తమ వినతులను అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఇస్తుంటారు. అయితే దినేశ్ విజ్ఞప్తిపై సీఎం విజయ్ తక్షణమే స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. సచివాలయానికి వెళ్లిన వెంటనే సంబంధిత అధికారులను ఆదేశించి దినేశ్‌కు తగిన ఉద్యోగం ఏర్పాటు చేయాలని సూచించారు. గురువారం ఉదయం సచివాలయం నుంచి దినేశ్‌కు పిలుపురావడంతో అతడు అక్కడికి చేరుకున్నాడు.

సీఎం విజయ్ స్వయంగా ఆ యువకుడితో కరచాలనం చేసి, తిరువొత్తియూరులోని ప్రభుత్వ శిక్షణ కేంద్రంలో అసిస్టెంట్ (సహాయకుడు) పోస్టుకు సంబంధించిన నియామక పత్రాన్ని చేతికి అందించారు. అడిగిన ఒక్క రోజులోనే ఉద్యోగం రావడంతో దినేశ్ కంటి వెంట ఆనంద భాష్పాలు రాలాయి. తన కష్టాన్ని గుర్తించి మరుసటి రోజే హామీ నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి విజయ్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.