రైతుల కష్టాల కంటే హెయిర్‌స్టైల్ ముఖ్యమా?.. సీఎం విజయ్‌పై సెటైర్లు.!
Tamil Nadu Politics: రైతుల సమస్యల కంటే, సీఎం జోసెఫ్ విజయ్ తన హెయిర్‌స్టైల్ మార్చుకోవడంపైనే ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారని అన్నాడీఎంకే సీనియర్ నేత ఉదయకుమార్ విమర్శలు చేశారు.
రైతుల కష్టాల కంటే హెయిర్‌స్టైల్ ముఖ్యమా?.. సీఎం విజయ్‌పై సెటైర్లు.!
Tamil Nadu Politics: కావేరీ డెల్టా ప్రాంతంలో అప్పుల ఊబిలో చిక్కుకుని ఇబ్బంది పడుతున్న రైతుల సమస్యల కంటే, సీఎం జోసెఫ్ విజయ్ తన హెయిర్‌స్టైల్ మార్చుకోవడంపైనే ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారని అన్నాడీఎంకే సీనియర్ నేత ఆర్బీ ఉదయకుమార్ ఆదివారం తీవ్ర విమర్శలు చేశారు. నీటి కొరత వల్ల పంటలు దెబ్బతిని రైతులు భారీ అప్పులపాలయ్యారని, డెల్టా ప్రాంతాన్ని తనిఖీ చేసి కరువు ప్రాంతంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. వెంటనే పరిహారం, పంట బీమా సొమ్ముతో పాటు ఇతర సాయం అందించాలని కోరారు. మార్పు వస్తుందని ఆశించి విజయ్‌కు ఓటేసిన ఓటర్లు ఇప్పుడు నిరాశ పడుతున్నారని ఓ వీడియో ప్రకటనలో ఉదయకుమార్ పేర్కొన్నారు.
రిసెప్షన్ లుక్‌తో పోలుస్తూ చురకలు
చెన్నైలో మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరైనప్పుడు సీఎం విజయ్ లుక్ గురించి మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన చర్చను ఉదయకుమార్ ప్రస్తావించారు. రైతుల కష్టాలతో దాన్ని పోలుస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సినిమా యాక్టర్‌గా ఉన్నప్పుడు హెయిర్‌స్టైల్‌పై టైమ్, శ్రద్ధ పెడితే ఎవరికీ ఇబ్బంది ఉండేది కాదని, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమిళనాడు రైతుల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి అంతే శ్రద్ధ చూపుతారా అని ప్రశ్నించారు. పెళ్లి వేడుకలో విజయ్ కొత్త లుక్ కళ్లకు పండుగలా అనిపించి ఉండొచ్చేమో కానీ, రైతుల బాధలు మాత్రం కన్నీళ్లే మిగులుస్తున్నాయని అన్నారు. అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, సీఎం హెయిర్‌స్టైల్ హెడ్‌లైన్స్‌లో రావడం ఏంటని, అన్నదాతలు ఎవరికి చెప్పుకోవాలని నిలదీశారు.
చొక్కలింగం ఆత్మహత్య.. దెబ్బతిన్న 18 లక్షల ఎకరాల పంటలు
పుదుక్కోట్టై జిల్లా అవడైయార్‌కోయిల్ తాలూకా కుళత్తుక్కుడియిరుప్పుకు చెందిన చెల్లదురై అలియాస్ చొక్కలింగం ఇటీవల చనిపోయిన ఘటనను ఉదయకుమార్ ప్రస్తావించారు. ఏడు ఎకరాల్లో సాంబా వరి పండించిన చొక్కలింగం, నీటి కొరత వల్ల రెండుసార్లు పంట ఎండిపోయి, అప్పులు తీర్చలేక తన పొలంలోనే ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. కావేరీ డెల్టా జిల్లాల్లో సాధారణంగా 18 లక్షల ఎకరాలకు పైగా సాంబా, తలాది పంటలు సాగు చేస్తారని తెలిపారు. మెట్తూరు డ్యామ్ నుంచి నీటి విడుదల ఆలస్యం కావడంతో కురువై పంట ఇప్పటికే దెబ్బతిందని, ఆ తర్వాత విడిచిన నీరు కూడా మొత్తం పంట కాలానికి సరిపోలేదని ఆరోపించారు. దీంతో సాంబా, తలాది పంటలు ఎండిపోయి రైతులు అప్పుల్లో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
కావేరీ నీటి వాటాపై మౌనం.. గత ప్రభుత్వాల గుర్తు
కావేరీ నీటి వాటాకు సంబంధించి తమిళనాడు వేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేయడాన్ని ఉదయకుమార్ పెద్ద ఎదురుదెబ్బగా అభివర్ణించారు. కర్ణాటక నుంచి అదనపు నీరు విడుదల చేయాలని కోరుతూ వేసిన పిటిషన్లను తిరస్కరిస్తూ, నీటి లోటును పర్యవేక్షించే బాధ్యత కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ, కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీకి వదిలేయాలని కోర్టు చెప్పడాన్ని గుర్తు చేశారు. కావేరీ అంశంపై విజయ్ కొనసాగిస్తున్న మౌనం రైతుల్లో ఆగ్రహం పెంచుతోందని, ఇది తమిళనాడు ప్రయోజనాలకు నష్టం కలిగిస్తుందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, ఎడప్పాడి కె పళనిస్వామి నేతృత్వంలోని గత అన్నాడీఎంకే ప్రభుత్వాలు డెల్టా రైతులను ఆదుకోవడానికి కరువు సాయం అందించాయని గుర్తు చేస్తూ, ఇప్పుడు విజయ్ కూడా ఆ బాటలో నడిచి రైతులకు అండగా నిలుస్తారా అని ప్రశ్నించారు.




