CM Vijay: సీఎం విజయ్ పేరుతో భారీ సైబర్ మోసం.. లక్షలు కాజేసిన ముఠా.. పోలీస్ స్టేషన్‌లో బాధితుల క్యూ
CM Vijay: సైబర్ నేరగాళ్లు సరికొత్త పద్ధతిలో అమాయక ప్రజలను బురిడీ కొట్టించేందుకు ప్లాన్ చేశారు.
CM Vijay
CM Vijay: సైబర్ నేరగాళ్లు సరికొత్త పద్ధతిలో అమాయక ప్రజలను బురిడీ కొట్టించేందుకు ప్లాన్ చేశారు.తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ పేరును ఉపయోగించి మధ్యప్రదేశ్‌లో ఒక కేటుగాళ్ల ముఠా భారీ సైబర్ మోసానికి ఒడిగట్టింది. జోసెఫ్ విజయ్‌కి సొంతంగా ఒక పెద్ద ఛారిటబుల్ ట్రస్ట్ ఉందంటూ, అందులో తాము ముఖ్య అధికారులమని నమ్మబలికారు. సీఎం విజయ్ ట్రస్ట్ నుంచి ఆర్థిక సాయం, స్వయం ఉపాధి రుణాలు అందిస్తామంటూ ఆశచూపి ప్రజల వద్ద నుంచి లక్షలాది రూపాయలు కాజేసింది. సోషల్ మీడియా వేదికగా మధ్యప్రదేశ్ ప్రజలను నేరుగా సంప్రదించారు. నిరుద్యోగులు, చిన్న వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని వారికి ప్రభుత్వేతర పథకాల ద్వారా రూ. లక్షల్లో ఉపాధి రుణాలు, ఉచిత ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి ముగ్గులోకి దించారు.
రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీజుల పేరిట దందాలు
సినిమా నటుడు, సీఎం విజయ్ పేరు కావడంతో ప్రజలు సైబర్ ముఠా మాటలను నిజమని నమ్మారు. లబ్ధిదారుల జాబితాలో పేరు చేర్చడానికి, ప్రొఫైల్ వెరిఫికేషన్, ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో బాధితుల నుంచి విడతల వారీగా డబ్బులు గుంజడం మొదలుపెట్టారు. ఒక్కో వ్యక్తి నుంచి రూ.1,000 నుంచి రూ.50,000 వరకు డిజిటల్ విధానంలో వసూలు చేశారు. డబ్బులు ఖాతాలో పడగానే కేటుగాళ్లు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యారు. మోసపోయామని గ్రహించిన బాధితులు ఇండోర్ పోలీసు స్టేషన్‌కు క్యూ కట్టడం ప్రారంభించారు.
పోలీసుల రంగ ప్రవేశం.. ఇండోర్‌లో కేసులు నమోదు
బాధితుల ఫిర్యాదుల ఆధారంగా ఇండోర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. గత నెలలోనే ఈ నెట్‌వర్క్‌పై సుమారు 6 అధికారిక ఫిర్యాదులు దాఖలైనట్లు అదనపు డెప్యూటీ కమిషనర్ రాజేష్ తండోడియా ధ్రువీకరించారు. నిందితుల బ్యాంక్ ఖాతాలు, ఫోన్ నంబర్ల ఆధారంగా ముఠా మూలాలను వెలికితీసే పనిలో ఉన్నారు. ఇతర రాష్ట్రాలకు కూడా ఈ సైబర్ ముఠాతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.
సైబర్ క్రైమ్ పోలీసుల హెచ్చరిక
ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, సీనియర్ ఐపీఎస్ అధికారుల ఫొటోలను సోషల్ మీడియా ప్రొఫైళ్లుగా మార్చుకుని నేరాలకు పాల్పడటం ఈ మధ్యకాలంలో ఎక్కువైందని క్రైమ్ బ్రాంచ్ కమిషనర్ వెల్లడించారు. ప్రభుత్వం లేదా అధికారిక సంస్థల నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని, ఆన్‌లైన్‌లో ఎవరికీ ముందస్తుగా డబ్బులు చెల్లించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. సమాజంలో ఉన్న ప్రజాదరణను ఆసరాగా చేసుకుని సైబర్ ముఠాలు అక్రమార్జనకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆన్‌లైన్‌లో ఉచిత రుణాలు లేదా ఆర్థిక సాయం అంటూ వచ్చే అనుమానాస్పద లింకులు, కాల్స్ పట్ల ప్రజలు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండటం అవసరం.




