Tamil Nadu: డీఎంకేకు భారీ షాక్.. కోర్టులో లొంగిపోయిన మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ!

Tamil Nadu: తమిళనాడులో ప్రభుత్వంపై కుట్ర ఆరోపణల కేసులో డీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ కోర్టులో లొంగిపోయారు.

Arun Chilukuri
Published on: 25 July 2026 11:47 AM IST
Tamil Nadu
X

Tamil Nadu: డీఎంకేకు భారీ షాక్.. కోర్టులో లొంగిపోయిన మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ!

Tamil Nadu: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ప్రభుత్వంపై కుట్ర ఆరోపణల కేసులో మాజీ మంత్రి, డీఎంకే (DMK) ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ శుక్రవారం న్యాయస్థానం ఎదుట లొంగిపోయారు. ఈ కేసులో ఈ నెల 8న ఆయనకు ముందస్తు బెయిల్ లభించినప్పటికీ, కోర్టు విధించిన నిబంధనలు మరియు విచారణ ప్రక్రియలో భాగంగా ఆయన జడ్జి ముందు హాజరయ్యారు.

ఈ కేసులో సెంథిల్ బాలాజీతో పాటు ఆయన సోదరుడు అశోక్ కుమార్‌కు మద్రాస్ హైకోర్టు జస్టిస్ జి.కె. ఇళందిరైయన్ ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. అయితే, 15 రోజుల్లోగా చెన్నై ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో లొంగిపోయి రూ. 25,000 సొంత పూచీకత్తుతో పాటు ఇద్దరి ష్యూరిటీలను సమర్పించాలని ఆదేశించారు.

హైకోర్టు ఆదేశాల ప్రకారం శుక్రవారం ఉదయం 10:30 గంటలకు సెంథిల్ బాలాజీ ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో హాజరై పూచీకత్తు పత్రాలను సమర్పించారు. దీంతో జడ్జి కార్తికేయన్ ఆయనకు అధికారికంగా బెయిల్ మంజూరు చేస్తూ, శనివారం నుంచి విచారణాధికారి ముందు హాజరై సంతకం చేయాలని ఆదేశించారు.

ఈ కేసులో మరో నిందితుడైన సెంథిల్ బాలాజీ సోదరుడు అశోక్ కుమార్ వేరే కేసు నిమిత్తం కరూర్‌లో ఉండటంతో ఆయన శుక్రవారం హాజరుకాలేకపోయారు. అశోక్ కుమార్ సోమవారం కోర్టులో లొంగిపోయి పూచీకత్తు పత్రాలు సమర్పించే అవకాశం ఉందని సమాచారం.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story