CM Vijay : తమిళనాడు సర్కార్ బిగ్ గిఫ్ట్.. గ్యాస్, బస్సు ఫ్రీ..
CM Vijay : తమిళనాడు శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ పలు సంచలనాత్మక సంక్షేమ పథకాలను ప్రకటించారు. పేదరికాన్ని నిర్మూలించడమే కాకుండా
cm-vijay
CM Vijay : తమిళనాడు శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ పలు సంచలనాత్మక సంక్షేమ పథకాలను ప్రకటించారు. పేదరికాన్ని నిర్మూలించడమే కాకుండా పౌరుల ఆర్థిక భారాన్ని తగ్గించే లక్ష్యంతో ‘అన్నపూర్ణి సూపర్ సిక్స్’ పథకంతో పాటు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాల విస్తరణను ఆయన అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. ఈ చారిత్రక నిర్ణయాలు రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజలకు భారీ ఉపశమనం కలిగించనున్నాయి.
'అన్నపూర్ణి సూపర్ సిక్స్'.. పేద కుటుంబాలకు ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు
రాష్ట్రంలోని పేద కుటుంబాల రక్షణే ధ్యేయంగా తమిళనాడు ప్రభుత్వం ‘అన్నపూర్ణి సూపర్ సిక్స్’ అనే నూతన పథకాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది. సంవత్సరానికి 2.5 లక్షల రూపాయల కంటే తక్కువ వార్షిక ఆదాయం కలిగిన ప్రతి పేద కుటుంబం ఈ పథకానికి అర్హులుగా ఉంటారు. దీనిద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.30 కోట్ల కుటుంబాలకు ప్రత్యక్ష లబ్ధి చేకూరనుంది.
ఈ పథకం 2027 పొంగల్ పండుగ నాటికి అధికారికంగా అమలులోకి వస్తుంది. అర్హులైన లబ్ధిదారులు కొనుగోలు చేసే మూడు వంటగ్యాస్ సిలిండర్ల మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి డిపాజిట్ చేస్తుంది. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై ఏటా సుమారు 4,000 కోట్ల రూపాయల అదనపు భారం పడనుందని అంచనా వేస్తున్నారు. గల్ఫ్ రీజియన్‌లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల వల్ల గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడటమే కాకుండా వాటి ధరలు ఆకాశాన్ని తాకడం పౌరులపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి అసెంబ్లీలో స్పష్టం చేశారు.
'వెట్రి పయనం'.. మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణం
మహిళల ఆర్థిక స్వావలంబనకు ఉచిత ప్రయాణమే ముఖ్యమైన పునాది అని విశ్వసించే తమిళనాడు ప్రభుత్వం, ఇప్పటి వరకు అమల్లో ఉన్న ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని మరింతగా విస్తరించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ట్రాన్స్‌జెండర్లందరికీ ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు సీఎం విజయ్ ప్రకటించారు.
ఇప్పటివరకు కేవలం సాధారణ , కొండ ప్రాంత బస్సుల్లో పరిమిత దూరానికే ఉన్న ఉచిత సౌకర్యాన్ని, ఇకపై సాధారణ బస్సులతో పాటు ఎక్స్‌ప్రెస్, ఎల్ఎస్ఎస్, డీలక్స్ , జిల్లాల మధ్య తిరిగే ఇంటర్-డిస్ట్రిక్ట్ సర్వీసుల్లోకి కూడా విస్తరిస్తున్నారు. అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈ 'వెట్రి పయనం' పథకాన్ని ప్రారంభించనుండగా, దీనికోసం ప్రభుత్వం ఏటా 6,000 కోట్ల రూపాయలను కేటాయించనుంది.
పరందూర్ విమానాశ్రయం రద్దు ప్రకటన.. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో కొత్త టెర్మినల్
చెన్నై సమీపంలోని పరందూర్ ప్రాంతంలో ప్రతిపాదించిన గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ ప్రాజెక్టును పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి అసెంబ్లీలో పునరుద్ఘాటించారు. రైతులు , స్థానిక ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తూ, అనేక కుటుంబాలను నిర్వాసితులను చేసే ఏ ప్రాజెక్టుకూ తమ ప్రభుత్వం సుముఖంగా లేదని తేల్చి చెప్పారు.
దేశానికి వెన్నుముక లాంటి రైతుల ప్రయోజనాలను కాపాడటమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని వ్యాఖ్యానించిన ఆయన, ఎవరికీ నష్టం కలగని ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. దీనికి తోడుగా మీనంబాక్కంలోని ప్రస్తుత చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలోనే అత్యంత ఆధునిక సదుపాయాలతో సరికొత్తగా 'టెర్మినల్ 5' ను నిర్మించబోతున్నట్లు ప్రకటించారు.




