Tamil Nadu: మద్యం ధరలపై అదనపు వసూళ్లు.. మూడు రోజుల్లో 240 మంది టాస్మాక్ సిబ్బంది సస్పెన్షన్

Tamil Nadu: మద్యం బాటిళ్లపై ఎమ్మార్పీ కంటే అదనంగా వసూలు చేస్తున్న టాస్మాక్ సిబ్బందిపై తమిళనాడు ప్రభుత్వం సీరియస్ అయింది.

Arun Chilukuri
Published on: 5 Sept 2026 2:54 PM IST
Tamil Nadu
X

Tamil Nadu: మద్యం ధరలపై అదనపు వసూళ్లు.. మూడు రోజుల్లో 240 మంది టాస్మాక్ సిబ్బంది సస్పెన్షన్

Tamil Nadu: మద్యం బాటిళ్లపై నిర్ణయించిన ఎమ్మార్పీ (MRP) ధర కంటే అదనంగా రూ.10 వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులపై తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. రాష్ట్రంలోని టాస్మాక్ (TASMAC) దుకాణాల్లో వినియోగదారుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న సిబ్బందిపై ప్రభుత్వం కొరడా ఝళిపించింది. ముఖ్యమంత్రి విజయ్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేయగా, కేవలం మూడు రోజుల్లోనే 240 మందికి పైగా సిబ్బంది సస్పెండ్‌ అయినట్లు సమాచారం.

చెన్నైతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో టాస్మాక్ షాపులపై అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎమ్మార్పీ కంటే అదనంగా నగదు వసూలు చేసే సిబ్బందిపై వేటు వేస్తున్నట్లు స్పష్టం చేశారు. తొలిసారి తప్పు చేస్తే మూడు నెలల పాటు సస్పెన్షన్ విధిస్తామని, ఒకవేళ అదే తప్పు పునరావృతమైతే శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగిస్తామని అధికారులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ వినియోగదారులను దోచుకునే చర్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు.

అధికారుల చేపట్టిన సస్పెన్షన్లపై కొన్ని ప్రాంతాల్లో టాస్మాక్ సిబ్బంది నిరసనలకు దిగారు. షాపులు మూసివేసి తమ ఆందోళనను వ్యక్తం చేశారు. ఎలాంటి విచారణ లేకుండా, తప్పు చేయకపోయినా తమను టార్గెట్ చేసి సస్పెండ్ చేస్తున్నారని పలువురు సూపర్‌వైజర్లు, సేల్స్‌మెన్లు ఆరోపించారు. మరోవైపు, ఈ అదనపు వసూళ్ల వ్యవహారం ప్రజల్లో వ్యతిరేకతకు దారితీస్తుందని భావించిన సీఎం విజయ్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎక్కడా అదనపు వసూళ్లకు తావులేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో, రానున్న రోజుల్లోనూ తనిఖీలు మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story