CM Vijay: తమిళనాడులో 17 మంది ఖైదీల జైల్‌బ్రేక్.. సీఎం విజయ్ సంచలన ఆదేశాలు..

CM Vijay: తమిళనాడు తేని జిల్లా జైల్‌బ్రేక్ ఘటనపై సీఎం విజయ్ సీరియస్. జైలు డిఎస్పీ సస్పెన్షన్, జైళ్ల శాఖలో భారీగా బదిలీలకు ఆదేశం.

Arun Chilukuri
Published on: 31 Oct 2026 11:32 AM IST
CM Vijay
X

CM Vijay: తమిళనాడులో 17 మంది ఖైదీల జైల్‌బ్రేక్.. సీఎం విజయ్ సంచలన ఆదేశాలు..

CM Vijay: తమిళనాడులోని తేని జిల్లా తెక్కంపట్టి సబ్ జైలు నుంచి సినీఫక్కీలో 17 మంది ఖైదీలు తప్పించుకు పారిపోయిన సంచలన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా స్పందించింది. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన ఈ 'జైల్‌బ్రేక్' ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతుండగానే, ముఖ్యమంత్రి విజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన ఆదేశాలు జారీ చేశారు.

విధి నిర్వహణలో తీవ్ర అలసత్వం, నిర్లక్ష్యం వహించినందుకు గానూ సంబంధిత జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ (DSP)ను తక్షణమే సస్పెండ్ చేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. అంతేకాకుండా భద్రతా లోపాలకు కారణమైన ఇతర జైలు అధికారుల అందరిపైనా కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సీఎం విజయ్ ఆదేశించారు. ఈ ఘోర భద్రతా లోపం నేపథ్యంలో రాష్ట్ర జైళ్ల శాఖలో భారీ ఎత్తున అధికారుల బదిలీలు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.

కాగా, అక్టోబరు 26వ తేదీ రాత్రి తెక్కంపట్టి సబ్ జైలులోని ఖైదీలు పథకం ప్రకారం జైలు సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేసి, గోడలు దూకి 17 మంది ఒకేసారి తప్పించుకు పారిపోయారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన తమిళనాడు పోలీసు యంత్రాంగం 20కి పైగా ప్రత్యేక గాలింపు బృందాలను ఏర్పాటు చేసి, రాష్ట్రవ్యాప్తంగా జల్లెడ పట్టి పారిపోయిన 17 మంది ఖైదీలను తిరిగి బంధించారు.

ప్రస్తుతం పట్టుబడిన ఖైదీలందరినీ రాష్ట్రంలోని అత్యంత పటిష్టమైన భద్రత కలిగిన కేంద్ర కారాగారాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. ఈ నాటకీయ పరిణామాల నేపథ్యంలో తమిళనాడులోని అన్ని జైళ్ల వద్ద మునుపెన్నడూ లేని విధంగా సెక్యూరిటీని అత్యంత కట్టుదిట్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.