Tamil Nadu Airport : పరందూర్‌కు గుడ్‌బై.. చెన్నై కొత్త ఎయిర్‌పోర్ట్ ఎక్కడంటే.?
Tamil Nadu Airport : తమిళనాడు ప్రభుత్వం చెన్నై మెట్రోపాలిటన్ ఏరియా అవసరాల కోసం సరికొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది.
TamilNadu-TVK-Vijay-CM
Tamil Nadu Airport : తమిళనాడు ప్రభుత్వం చెన్నై మెట్రోపాలిటన్ ఏరియా అవసరాల కోసం సరికొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. తీవ్ర వివాదాస్పదమైన పరందూర్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్‌ను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే, ప్రభుత్వం కొత్త విమానాశ్రయం కోసం రెండు ప్రత్యామ్నాయ స్థలాలను ఖరారు చేసింది. కేవలం వారం వ్యవధిలోనే ప్రభుత్వం మానెల్లోర్ , చెయ్యూర్ ప్రాంతాలను ఎంపిక చేసి, వాటి సాంకేతిక, ఆర్థిక సాధ్యసాధ్యాల పరిశీలన కోసం ఎయిర్‌పోర్ట్స్ అథపరిటీ ఆఫ్ ఇండియాకు సమాచారాన్ని అందించింది. ఇందులో మానెల్లోర్ ప్రాంతం చెన్నై నగరం నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉండగా, చెయ్యూర్ దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో విస్తరించి ఉంది.
పరందూర్ ప్రాజెక్ట్ రద్దుకు బలమైన కారణాలు
రైతుల ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. గ్రేటర్ చెన్నై పారిశ్రామిక, కార్గో రవాణా అవసరాలకు రెండవ ఎయిర్‌పోర్ట్ ఎంత ముఖ్యమో, వ్యవసాయ భూములు , నివాస ప్రాంతాలు దెబ్బతినకుండా స్థలాన్ని ఎంపిక చేయడం కూడా అంతే ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం ఎంపిక చేసిన పరందూర్ ప్రాజెక్ట్ వల్ల సారవంతమైన పంట పొలాలు, వేలాది మంది గ్రామీణుల జీవనోపాధి దెబ్బతినే ప్రమాదం ఉందని వివరించారు. ఎయిర్‌పోర్ట్ కోసం కేటాయించిన 5,846 ఎకరాలలో దాదాపు 2,681 ఎకరాల సారవంతమైన వ్యవసాయ భూములు, 1,558 ఎకరాల జలవనరులు, కాలువలు ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది.
ప్రతిపక్షాల విమర్శలు , ప్రభుత్వ సమాధానం
పరందూర్ ప్రాజెక్ట్‌ను రద్దు చేయడంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాక ఇలా ప్రాజెక్ట్‌ను అర్ధాంతరంగా నిలిపివేయడం వల్ల రాష్ట్ర ఆర్థిక రంగానికి పెద్ద దెబ్బ తగులుతుందని విమర్శించగా, ప్రభుత్వం ఆ ఆరోపణలను తిరస్కరించింది. ఈ విషయంపై మంత్రి ఆర్. నిర్మల్ కుమార్ స్పందిస్తూ, గత డిఎమ్‌కే ప్రభుత్వం ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండానే భూసేకరణకు పూనుకుందని విమర్శించారు. ప్రాజెక్ట్ పనులు 90 శాతం పూర్తయ్యాయన్నది అబద్ధమని, ఇప్పటివరకు కేవలం 48 శాతం భూమిని మాత్రమే సేకరించారని స్పష్టం చేశారు. పర్యావరణాన్ని, రైతుల హక్కులను కాపాడుతూనే, సాంకేతికంగా అనుకూలమైన చోట కొత్త ఎయిర్‌పోర్ట్‌ను త్వరలోనే నిర్మిస్తామని విజయ్ ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది.




