Thalapathy Vijay: విజయ్ సీఎం కానట్టేనా..? డీఎంకే – అన్నాడీఎంకే పొత్తు.. తమిళ రాజకీయాల్లో సంచలనం
Thalapathy Vijay: తమిళనాడులో మారుతున్న రాజకీయ సమీకరణాలు.
Thalapathy Vijay: విజయ్ సీఎం కానట్టేనా..? డీఎంకే – అన్నాడీఎంకే పొత్తు.. తమిళ రాజకీయాల్లో సంచలనం
DMK and AIADMK: తమిళనాడు రాజకీయ క్షేత్రంలో మునుపెన్నడూ లేని విధంగా ఒక పొలిటికల్ థ్రిల్లర్ సినిమాను తలపించే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దశాబ్దాలుగా ఉప్పు-నిప్పులా ఉండే ద్రవిడ దిగ్గజాలు డీఎంకే , అన్నాడీఎంకే ఇప్పుడు ఒకే తాటిపైకి వస్తున్నాయనే వార్త రాష్ట్రంలో పెను సంచలనం సృష్టిస్తోంది. తమిళనాడు అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ అందుకోవడం ఇప్పుడు ఒక గమ్మత్తైన సమీకరణంగా మారింది. ఒకవైపు ప్రజాకర్షణతో దూసుకుపోతున్న విజయ్, మరోవైపు తమ ఉనికిని కాపాడుకోవాలని ద్రవిడ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.
విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి మేజిక్ ఫిగర్ కంటే 11 సీట్లు తక్కువ వచ్చాయి. కాంగ్రెస్ తన మద్దతును విజయ్‌కు ప్రకటించడంతో ఆయన శిబిరంలో ఉత్సాహం నెలకొంది. మేజిక్ ఫిగర్ చేరుకోవాలంటే ఇంకా 6 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ ఆరుగురు ఎవరన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. సంఖ్యాబలంపై స్పష్టమైన ఆధారాలు లేకపోవడంతో గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో ఈ రోజు జరగాల్సిన విజయ్ ప్రమాణస్వీకారం వాయిదా పడింది. ఎమ్మెల్యేలంతా ప్రస్తుతం రిసార్ట్ రాజకీయాల్లో తలమునకలై ఉన్నారు.
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరనే మాట తమిళనాడులో నిజం కాబోతోంది. ప్రస్తుతం డీఎంకే (59), అన్నాడీఎంకే (47) సీట్లతో ఉన్నాయి. ఈ రెండు పార్టీలు, వాటి మిత్రపక్షాలతో కలిస్తే ఆ సంఖ్య 120కి చేరుతుంది. అంటే మేజిక్ ఫిగర్ దాటుతుంది. మూడవ శక్తిగా విజయ్ ఎదిగితే భవిష్యత్తులో ద్రవిడ పార్టీల మనుగడ కష్టమని భావించి, శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సూత్రంతో ఇరు పార్టీలు తెరవెనుక చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
విజయ్ ఆశలు పెట్టుకున్న వామపక్షాలు షాక్ ఇచ్చాయి. డీఎంకేతో ఉన్న పొత్తు ధర్మాన్ని వీడబోమని, విజయ్‌కు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాయి. అటు ఐయూఎంఎల్ , వీసీకే పార్టీలు కూడా ఇంకా తమ కార్డులను బయటపెట్టకపోవడంతో ఉత్కంఠ కొనసాగుతోంది.
ముందున్న మార్గాలేంటి?
తమిళనాడు రాజకీయం ఇప్పుడు మూడు ముక్కల ఆటలా మారింది. స్వతంత్రులు లేదా ఇతర చిన్న పార్టీల నుంచి ఆ ఆరుగురు ఎమ్మెల్యేలను సంపాదిస్తే దళపతి సీఎం కుర్చీలో కూర్చుంటారు. డీఎంకే-అన్నాడీఎంకే ఒక్కటైతే విజయ్ విపక్షానికే పరిమితం కావాల్సి ఉంటుంది. ఇది తమిళ రాజకీయాల్లో ఒక కొత్త శకానికి నాంది అవుతుంది. ఏ పార్టీకి మెజారిటీ నిరూపించుకునే అవకాశం లేకపోతే రాష్ట్రం గవర్నర్ పాలనలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది. తమిళ తంబీలు ఎవరికి పట్టం కడతారో అన్న ఉత్కంఠ రిసార్టుల నుండి రాజ్ భవన్ వరకు పాకింది. ద్రవిడ కోటను విజయ్ బద్దలు కొడతారా? లేక ద్రవిడ సింహాలు ఏకమై కోటను కాపాడుకుంటాయా? అనేది తేలాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.




