Tamil Nadu Politics : విజయ్ ఎమ్మెల్యేల రాజీనామా.? తమిళనాడులో హైటెన్షన్ డ్రామా.!
Tamil Nadu Politics : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్ర రాజకీయాలు మునుపెన్నడూ లేని విధంగా ఒక ఉత్కంఠభరితమైన మలుపు తిరిగాయి.
Tamil Nadu Politics
Tamil Nadu Politics : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్ర రాజకీయాలు మునుపెన్నడూ లేని విధంగా ఒక ఉత్కంఠభరితమైన మలుపు తిరిగాయి. ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ క్రమంలో తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు అనైతికంగా చేతులు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తే, తన పార్టీకి చెందిన 107 మంది ఎమ్మెల్యేలతో మూకుమ్మడి రాజీనామా చేయించాలని విజయ్ భావిస్తున్నట్లు సమాచారం.
విజయ్‌ను అడ్డుకునేందుకు బద్ధశత్రువుల స్నేహం.?
తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒకరినొకరు కలలో కూడా చూసుకోని డీఎంకే (DMK), అన్నాడీఎంకే (AIADMK) ఇప్పుడు విజయ్‌ను అధికారానికి దూరం చేసేందుకు చేతులు కలుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, డీఎంకే 59 సీట్లు సాధించగా, అన్నాడీఎంకే 47 సీట్లు గెలుచుకుంది. ఈ రెండు పార్టీలు కలిస్తే వారి బలం 106కు చేరుతుంది. విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) 107 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ఆయన్ను ముఖ్యమంత్రి పీఠం ఎక్కకుండా అడ్డుకోవడానికి ఈ రెండు ద్రావిడ పార్టీలు తెరవెనుక పావులు కదుపుతుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
బలనిరూపణపై గవర్నర్ పట్టు.. విజయ్ సమీకరణాలు
తమిళనాడు అసెంబ్లీలోని మొత్తం 234 స్థానాల్లో మెజారిటీ మార్కు 118. విజయ్ పక్షాన ప్రస్తుతం తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందితో పాటు కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు సభ్యుల మద్దతు ఉంది. అంటే మొత్తం 112 మంది మద్దతు విజయ్‌కు ఉంది. ఇదే కాకుండా DMDK పార్టీ (1 ఎమ్మెల్యే) కూడా విజయ్ కి మొగ్గుగానే ఉంది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 మంది మద్దతు ఉండాల్సిందేనని గవర్నర్ పట్టుబడుతున్నారు. దీంతో విజయ్ ఇప్పుడు ఇతర మిత్రపక్షాలైన వీసీకే (VCK), లెఫ్ట్ పార్టీలు (సీపీఐ, సీపీఎం), ఐయూఎంఎల్ (IUML) మద్దతు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
లెఫ్ట్ పార్టీలు , వీసీకే నిర్ణయంపైనే టీవీకే భవితవ్యం
విజయ్ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు చిన్న పార్టీలైన వీసీకే (2 ఎమ్మెల్యేలు), లెఫ్ట్ పార్టీలు (4 ఎమ్మెల్యేలు), ఐయూఎంఎల్ (2 ఎమ్మెల్యేలు) నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. ఈ పార్టీలు గనుక విజయ్‌కు మద్దతు ప్రకటిస్తే ఆయన సులభంగా మ్యాజిక్ ఫిగర్ సాధిస్తారు. ఒకవేళ ఈ పార్టీలు మద్దతు ఇవ్వకుంటే, డీఎంకే , అన్నాడీఎంకే పార్టీలు ఇతర చిన్న పార్టీలైన పీఎంకే (04) వంటి వాటిని కలుపుకుని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రమాదం ఉందని టీవీకే వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
పళనిస్వామి ఎత్తుగడలు.. విజయ్ హెచ్చరిక
అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి శుక్రవారం గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. పళనిస్వామి తన పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ఇతర చిన్న పార్టీల మద్దతు లేఖలను గవర్నర్‌కు సమర్పించే అవకాశం ఉంది. ఈ పరిణామాలను గమనిస్తున్న విజయ్ క్యాంప్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. అతిపెద్ద పార్టీగా అవతరించిన తమను కాదని, కేవలం రాజకీయ లబ్ధి కోసం డీఎంకే-అన్నాడీఎంకే జతకడితే, తమ ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించి ప్రజల తీర్పు కోరడమే సరైన మార్గమని టీవీకే యోచిస్తోంది. అదే జరిగితే తమిళనాడులో మళ్ళీ మధ్యంతర ఎన్నికలు రావడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సాయంత్రం లోపు వెలువడే పొలిటికల్ అప్‌డేట్ తమిళనాడు భవిష్యత్తును నిర్ణయించనుంది.




