Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మళ్లీ ముప్పు.. ఎమ్మెల్యేలతో బిగ్‌బాస్ స్టైల్‌లో భేటీ

తమిళనాడు సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సాగుతున్నాయి.

CR Reddy
Published on: 12 Nov 2026 6:50 AM IST
Thalapathy Vijay
X

Thalapathy Vijay

Tamil Nadu: తమిళనాడు రాజకీయాల్లో మరోసారి అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళగ వెట్రి కళగం(TVK) అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంపై అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయనే ప్రచారం జోరందుకుంది. ఈ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సీఎం విజయ్ తన పార్టీ ఎమ్మెల్యేలతో హుటాహుటిన ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 2 గంటల 45 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో సీఎం విజయ్ వ్యవహరించిన తీరు ప్రస్తుతం తమిళనాట చర్చనీయాంశంగా మారింది.

బిగ్‌బాస్ కన్ఫెషన్ రూమ్ తరహాలో భేటీ

సాధారణంగా జరిగే పార్టీ సమావేశాలకు పూర్తి భిన్నంగా విజయ్ ఈసారి కొత్త వ్యూహాన్ని అమలు చేశారు. ఎమ్మెల్యేలందరినీ ఒకే చోట కూర్చోబెట్టి మాట్లాడకుండా, ఒక్కొక్కరిని విడివిడిగా పిలిచి ముఖాముఖి మాట్లాడారు. కొందరితో కేవలం ఒకటి రెండు నిమిషాలు మాట్లాడగా, మరికొందరితో చిన్న బృందాలుగా చర్చలు జరిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఒక ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీవీ రియాలిటీ షో బిగ్‌బాస్ కన్ఫెషన్ రూమ్‌ను ఈ భేటీ గుర్తు చేసిందని, నిఘా కళ్ల మధ్య భయాందోళనతో మాట్లాడాల్సి వచ్చిందని వ్యాఖ్యానించడం విశేషం.

నవంబర్ 13 తేదీ ఎందుకు కీలకమైనది?

విజయ్ ప్రభుత్వానికి నవంబర్ 13 తేదీ ఎందుకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందనే దానికి బలమైన కారణాలు ఉన్నాయి. మే 13న విజయ్ ప్రభుత్వం అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోగా, నవంబర్ 13 నాటికి ఆరు నెలల గడువు పూర్తవుతుంది. నిబంధనల ప్రకారం ఆరు నెలల తర్వాత మళ్లీ ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ఇచ్చే వెసులుబాటు ఉంటుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించవచ్చని విజయ్ తన ఎమ్మెల్యేలను హెచ్చరించినట్లు తెలుస్తోంది.

రూ.60-70 కోట్ల ఆఫర్లు.. మంత్రి సంచలన ఆరోపణలు

ఈ పొలిటికల్ హైడ్రామా మధ్య టీవీకే మంత్రి సీటీ నిర్మల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దావానలంలా వ్యాపించాయి. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను సంప్రదించిన డీఎంకే నేతలు ఒక్కొక్కరికి రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు ఎర చూపినట్లు ఆయన బహిరంగంగా ఆరోపించారు. ఢిల్లీలోని కొన్ని రాజకీయ శక్తుల వెనుకులుండి నడిపిస్తున్న ఈ కుట్రను ఛేదించామని, కొందరు వ్యక్తులను ఇప్పటికే అరెస్ట్ చేశామని వెల్లడించారు. దీనికి ప్రతిగా డీఎంకే కూడా టీవీకేపై ఎదురుదాడి ప్రారంభించడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఆరోపణలు కొనసాగుతున్నాయి.

ఆశపడితే రాజకీయ భవిష్యత్తు శూన్యమే

రాబోయే రోజుల్లో ప్రతిపక్షాల నుంచి వచ్చే ప్రలోభాలకు లొంగవద్దని విజయ్ తన పార్టీ శ్రేణులకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు పార్టీలో అద్భుతమైన రాజకీయ భవిష్యత్తు ఉందని హామీ ఇస్తూనే, తాత్కాలిక ప్రయోజనాలకు ఆశపడి విపక్షాల వైపు చూస్తే ఉన్న గుర్తింపు కూడా పోతుందని హెచ్చరించారు. మొత్తానికి నవంబర్ 13 తర్వాత తమిళనాడు అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ఎదురవుతుందా, దాన్ని తట్టుకుని విజయ్ ప్రభుత్వం నెగ్గుకొస్తుందా అనే అంశం ఉత్కంఠ రేపుతోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.