MK Stalin: ముఖ్యమంత్రి పదవికి సీఎం స్టాలిన్ రాజీనామా!
MK Stalin: తమిళనాడులో పెను సంచలనం: కొళత్తూర్ నియోజకవర్గంలో ఎం.కే.స్టాలిన్ ఓటమి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించిన స్టాలిన్. విజయ్ పార్టీ (TVK) అభ్యర్థి వి.ఎస్.బాబు ఘనవిజయం.
MK Stalin: ముఖ్యమంత్రి పదవికి సీఎం స్టాలిన్ రాజీనామా!
MK Stalin: తమిళనాడు రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కే.స్టాలిన్ తన పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆయన తన సొంత నియోజకవర్గంలోనే ఓటమి పాలుకావడంతో నైతిక బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.
సీఎం స్టాలిన్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొళత్తూర్ (Kolathur) నియోజకవర్గంలో ఆయనకు ఊహించని పరాభవం ఎదురైంది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) అభ్యర్థి వి.ఎస్.బాబు ఇక్కడ సంచలన విజయం సాధించారు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన కౌంటింగ్‌లో బాబు.. స్టాలిన్‌పై 8,795 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. డీఎంకేకు కంచుకోటగా భావించే ఈ నియోజకవర్గంలో స్టాలిన్ ఓడిపోవడం ఆ పార్టీ శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఎన్నికల ఫలితాల సరళిని గమనించిన స్టాలిన్, తన నియోజకవర్గంలో ఓటమి ఖాయమైన వెంటనే గవర్నర్‌ను కలిశారు. ముఖ్యమంత్రి పదవికి తన రాజీనామా లేఖను సమర్పించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆయన్ను ఆ పదవిలో కొనసాగాలని గవర్నర్ కోరినట్లు తెలుస్తోంది.
ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రి, అది కూడా దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నేత, కొత్తగా వచ్చిన పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోవడం తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త శకానికి నాందిగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విజయంతో టీవీకే శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నాయి.




