Tamil Nadu : యూట్యూబ్ చూసి భార్యకు డెలివరీ చేసిన భర్త.. చివరికి ఘోర విషాదం
Tamil Nadu : యూట్యూబ్ వీడియోలు చూసి డాక్టర్ అవతారమెత్తిన భర్త, ఇంట్లోనే భార్యకు కాన్పు చేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
Tamil Nadu
Tamil Nadu : టెక్నాలజీ ఈ రోజుల్లో ఎంత పెరిగినా కొన్ని విషయాల్లో సొంత తెలివితేటలు ప్రదర్శిస్తే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ. యూట్యూబ్ చూసి వంటలు చేయడం, చిన్న చిన్న ట్రిక్స్ నేర్చుకోవడం వరకు ఓకే.. కానీ ఏకంగా ప్రాణాలతో ముడిపడి ఉన్న కాన్పు (డెలివరీ) చేయడానికి ప్రయత్నించి ఒకరు చేతులారా తన భార్య ప్రాణాలను బలి తీసుకున్నారు. తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో జరిగిన ఈ షాకింగ్ ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. యూట్యూబ్‌ను నమ్మి ఇంట్లోనే ప్రసవం చేయడంతో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆ ఇంట్లో తీవ్ర విషాదం నిండింది.
తిరుప్పూర్ జిల్లా ఉతుకులి సమీపంలోని తల్వైపాళ్యం ప్రాంతానికి చెందిన కార్తీక్, శశికళ దంపతులకు ఇప్పటికే ఒక నాలుగేళ్ల కుమార్తె ఉంది. అయితే మొదటి కాన్పు సమయంలో శశికళకు సిజేరియన్ ద్వారా పాప జన్మించింది. ఈ క్రమంలో రెండో సంతానం కోసం గర్భం దాల్చిన శశికళకు ఈసారి ఎలాగైనా నార్మల్ డెలివరీ చేయించాలని ఈ దంపతులు నిర్ణయించుకున్నారు. ఇందుకోసం వారు ఆసుపత్రికి వెళ్లకుండా, ఇంట్లోనే సురక్షితంగా కాన్పు ఎలా చేయాలో తెలిపే పలు వీడియోలను యూట్యూబ్‌లో నిరంతరం చూడటం ప్రారంభించారు.
జూన్ 24న శశికళకు ప్రసవ నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆసుపత్రికి వెళ్లాల్సింది పోయి, తాము యూట్యూబ్‌లో చూసిన విద్యను ప్రయోగించాలని భర్త కార్తీక్ భావించాడు. అతనికి తోడుగా శశికళ అత్త (కార్తీక్ తల్లి) కూడా రంగంలోకి దిగింది. యూట్యూబ్ వీడియోలను క్షుణ్ణంగా చూస్తూ, అందులో చెప్పిన సూచనలను పాటిస్తూ వారు ఇంట్లోనే శశికళకు ప్రసవం చేశారు. శశికళ ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మొదట ఆ కుటుంబం అంతా ఆనందంలో మునిగిపోయింది.
ప్రసవం జరిగిన కొద్దిసేపటికే శశికళకు విపరీతంగా రక్తస్రావం కావడం మొదలైంది. డెలివరీ సమయంలో ఇలా జరగడం సహజమేనని భర్త, అత్త భావించి నిర్లక్ష్యం చేశారు. కానీ సమయం గడుస్తున్న కొద్దీ బ్లీడింగ్ అస్సలు ఆగకపోగా, శశికళ పరిస్థితి విషమంగా మారింది. ఆమె స్పృహ కోల్పోయే స్థితికి చేరుకోవడంతో భయపడిపోయిన కుటుంబ సభ్యులు హుటాహుటిన పెరుందురైలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు.
ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఆమె పరిస్థితిని పరిశీలించి, పరిస్థితి చేతులు దాటిపోవడంతో కోయంబత్తూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో కార్తీక్ తన భార్యను ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి ఐసీయూలో అత్యవసర చికిత్స అందించారు. అయితే అప్పటికే భారీగా రక్తం పోవడం, అంతర్గత అవయవాలు దెబ్బతినడంతో శశికళ చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ ఘటనపై ఉతుకులి పోలీసులు కేసు నమోదు చేసి, భార్య మరణానికి కారణమైన భర్త కార్తీక్, అతని కుటుంబ సభ్యులపై విచారణ చేపట్టారు.




