MK Stalin : అదొక "సౌండ్ లేని పటాకా".. TVK తొలి బడ్జెట్‌పై ఎంకే స్టాలిన్ సెటైర్లు..
MK Stalin : తమిళనాడు శాసనసభలో సీఎం సి. జోసెఫ్ విజయ్ నాయకత్వంలోని టీవీకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌పై మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే
mk-stalin
MK Stalin : తమిళనాడు శాసనసభలో సీఎం సి. జోసెఫ్ విజయ్ నాయకత్వంలోని టీవీకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌పై మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ బడ్జెట్‌ను అదొక సౌండ్ లేని పటాకా గా అభివర్ణించిన ఆయన, గత డీఎంకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకే కొత్త పేర్లు తగిలించి రీసైక్లింగ్ చేశారని, ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన ప్రధాన హామీలను మాత్రం పూర్తిగా పక్కనబెట్టారని ఆరోపించారు.
రీల్ ప్రభుత్వం.. రీమేక్ బడ్జెట్..
ప్రస్తుత ప్రభుత్వాన్ని ‘రీల్ ప్రభుత్వం’ అని ఎద్దేవా చేసిన స్టాలిన్, సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎంతగానో ఆశించిన ఈ తొలి బడ్జెట్ తీవ్ర నిరాశను మిగిల్చిందని, ఇందులో ఎలాంటి కొత్తదనం కానీ, సొంత ఆలోచనలు కానీ లేవని విమర్శించారు. గతంలో తమ డీఎంకే ప్రభుత్వ 'ద్రవిడ మోడల్' పాలనలో ప్రారంభించిన అనేక పథకాలనే పేరు మార్చి రీమేక్ వెర్షన్‌లా ప్రవేశపెట్టారని దుయ్యబట్టారు. రైతులకు ఎదురవుతున్న సమస్యలు, విద్యుత్ ఛార్జీల వ్యత్యాసాలు, అదుపులేని నిత్యావసరాల ధరలను అదుపు చేసే దిశగా ఎలాంటి పరిష్కారాలు చూపలేదని మండిపడ్డారు. రాష్ట్ర సమగ్ర ఆర్థికాభివృద్ధికి సంబంధించి బడ్జెట్‌లో ఎలాంటి స్పష్టమైన విజన్ లేదని అభిప్రాయపడ్డారు.
కీలక హామీలకు బడ్జెట్‌లో చోటేదీ..?
2026 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో టీవీకే పార్టీ ప్రజలకు ఇచ్చిన అనేక కీలక హామీలను ఈ బడ్జెట్‌లో ఎందుకు చేర్చలేదని స్టాలిన్ ప్రశ్నించారు. మహిళలకు నెలకు రూ. 2,500 భత్యం, నిరుద్యోగ యువతకు రూ. 4,000 ఆర్థిక సాయం, ప్రతి కుటుంబానికి ఏడాదికి ఉచితంగా 6 ఎల్పీజీ సిలిండర్లు , రైతుల పంట రుణాల పూర్తి మాఫీ వంటి ప్రధాన హామీల గురించి బడ్జెట్‌లో కనీసం ప్రస్తావించకపోవడం దారుణమని ఆయన పేర్కొన్నారు.
కేవలం పేరు మార్పిడి వ్యవహారమే.. ఉదయనిధి స్టాలిన్
తమిళనాడు శాసనసభ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ కూడా ఈ బడ్జెట్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఎలాంటి కొత్త పథకాలనూ రూపకల్పన చేయలేదని, గత డీఎంకే ప్రభుత్వంలో నడిచిన సంక్షేమ కార్యక్రమాలకే రీబ్రాండింగ్ చేసి వాడుకుంటున్నారని ఆరోపించారు. ముఖ్యంగా విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీ పథకానికి అధికార పార్టీ గుర్తుగా ఉండే "వెట్రి" అనే పదాన్ని తగిలించి 'వెట్రి మడికణిణి తిట్టం'గా మార్చడమే ఇందుకు నిదర్శనమని విమర్శించారు.
టీవీకే ప్రభుత్వం తొలి బడ్జెట్ ముఖ్యాంశాలు
తమిళనాడు ఆర్థిక మంత్రి మేరీ విల్సన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2031 నాటికి తమిళనాడును 1.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
ఈ బడ్జెట్‌లో అర్హులైన నవవధువులకు 8 గ్రాముల బంగారం, పట్టు చీర అందించే పథకం కోసం రూ. 812 కోట్లు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే పసిపిల్లలకు బంగారు ఉంగరాలు అందించేందుకు రూ. 560 కోట్లు కేటాయించారు. అలాగే కళాశాల విద్యార్థుల ల్యాప్‌టాప్‌ల పథకం కోసం రూ. 2,000 కోట్లు నిర్దేశించారు. తొలిసారి హజ్ యాత్రకు వెళ్లేవారికి ఇచ్చే సబ్సిడీని రూ. 25,000 నుంచి రూ. 35,000కు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇవే కాకుండా పాఠశాలల ఆధునీకరణ ('పల్లి నిరైవు తిట్టం') కోసం రూ. 300 కోట్లు, మాదకద్రవ్యాల రహిత తమిళనాడు ప్రచారం కోసం రూ. 7 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.




