Rahul Gandhi: టాటా సన్స్ వివాదం.. రాహుల్‌కు నిర్మలా సీతారామన్ కౌంటర్!
Rahul Gandhi: దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన టాటా గ్రూప్‌లో ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఎన్.చంద్రశేఖరన్ పునర్నియామకంపై రాజుకున్న వివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది.
Rahul Gandhi: టాటా సన్స్ వివాదం.. రాహుల్‌కు నిర్మలా సీతారామన్ కౌంటర్!
Rahul Gandhi: దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన టాటా గ్రూప్‌లో ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఎన్.చంద్రశేఖరన్ పునర్నియామకంపై రాజుకున్న వివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. టాటా సన్స్ బోర్డులో ఏర్పడిన ఈ అంతర్గత విభేదాలపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భారతీయ వ్యాపార రంగాన్ని బీజేపీ ప్రభుత్వం తన ఆటవస్తువులా మార్చుకుందని ఆరోపించారు. అయితే రాహుల్ వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా స్పందిస్తూ.. వాణిజ్య, చట్టపరమైన అంశాలను కూడా రాజకీయ లబ్ది కోసం వాడుకోవడం తగదంటూ గట్టిగా బదులిచ్చారు.
టాటా గ్రూప్‌ను నాశనం చేస్తున్నారు: రాహుల్ గాంధీ ఆరోపణలు
టాటా గ్రూప్ అత్యంత దారుణంగా, నేరపూరితంగా నాశనమైపోతున్నప్పటికీ దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలందరూ ఎందుకు మౌనంగా ఉన్నారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన.. "మీకు పూర్తిగా యాజమాన్యం దక్కే వరకు ఎంతకాలం మౌనంగా ఉంటారు? ఇండియన్ బిజినెస్‌లు బీజేపీకి ఆటవస్తువులు కావు" అని మండిపడ్డారు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా తాము న్యాయం జరిగేలా చూస్తామని రాహుల్ పేర్కొన్నారు.
రాజకీయం చేయడం మానుకోండి: నిర్మలా సీతారామన్ కౌంటర్
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూడటం లోక్‌సభ ప్రతిపక్ష నేతకు తగదని హితవు పలికారు. వాణిజ్య, న్యాయపరమైన అంశాలను నేరపూరితమైనవిగా సాధారణీకరించడం ఆమోదయోగ్యం కాదన్నారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ 'లైసెన్స్-కోటా రాజ్' పేరిట భారతీయ పారిశ్రామికవేత్తల స్ఫూర్తిని అణచివేసి దేశంలో పేదరికాన్ని పెంచిందని ఆమె విమర్శించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రం పారిశ్రామిక రంగాన్ని ఉపాధికి, ఆర్థిక వృద్ధికి మూలస్తంభంగా భావిస్తోందని, పరిశ్రమలను ఆదుకోవడానికి, పెట్టుబడులను ప్రోత్సహించడానికి తమ విధానాలు దోహదపడుతున్నాయని సీతారామన్ స్పష్టం చేశారు.
టాటా సన్స్ వివాదం వెనుక అసలు కారణం ఏంటి?
టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఎన్.చంద్రశేఖరన్ పునర్నియామక ప్రక్రియను వ్యతిరేకిస్తూ టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా లేవనెత్తిన అభ్యంతరాలే ఈ వివాదానికి ప్రధాన కారణం. సెప్టెంబర్ 17న జరిగిన బోర్డు సమావేశంలో చంద్రశేఖరన్ పునర్నియామకానికి సంబంధించిన తీర్మానాన్ని ఎలాంటి ముందస్తు ఎజెండా లేకుండానే ఆమోదించారని నోయెల్ టాటా ఆరోపించారు. ఈ సమావేశానికి సంబంధించిన ఆడియో, వీడియో రికార్డింగ్‌లను, తుది మినిట్స్‌ను తనకు అందించలేదని ఆయన అక్టోబర్ 26న రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఆర్టికల్ 118 ప్రకారం ఎలాంటి సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేయకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఈ తీర్మానం చేశారని ఆక్షేపించారు. రికార్డులను రహస్యంగా ఉంచి, ఇంకా మినిట్స్ కూడా ఫైనల్ కాకముందే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు ఈ తీర్మానాన్ని పంపడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ వివాదంపై పూర్తి రికార్డులను అందజేయాలని, వివాదం పరిష్కారమయ్యే వరకు తదుపరి చర్యలు నిలిపివేయాలని నోయెల్ టాటా డిమాండ్ చేయడం కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.




