Nida Khan: టీసీఎస్‌ కేసులో ట్విస్ట్‌: ‘నేను గర్భవతిని.. అరెస్ట్‌ నుంచి రక్షణ ఇవ్వండి’ - కోర్టును ఆశ్రయించిన నిదా ఖాన్

Nida Khan: నాసిక్ టీసీఎస్‌లో మతమార్పిడులు, లైంగిక వేధింపుల కేసులో నిందితురాలు నిదా ఖాన్ పరారీ. బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన నిందితురాలు. సిట్ దర్యాప్తు ముమ్మరం.

Arun Chilukuri
Published on: 17 April 2026 12:25 PM IST
Nida Khan
X

Nida Khan: టీసీఎస్‌ కేసులో ట్విస్ట్‌: ‘నేను గర్భవతిని.. అరెస్ట్‌ నుంచి రక్షణ ఇవ్వండి’ - కోర్టును ఆశ్రయించిన నిదా ఖాన్

Nida Khan: నాసిక్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో సాగుతున్న మతమార్పిడులు, మహిళా ఉద్యోగులపై వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న నిదా ఖాన్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె ముంబైలో ఉన్నట్లు సమాచారం అందుతుండగా, అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఆమె ముందస్తు బెయిల్ కోసం నాసిక్ స్థానిక కోర్టును ఆశ్రయించింది.

ఆరోగ్య కారణాలతో బెయిల్ ప్రయత్నాలు?

నిదా ఖాన్ ప్రస్తుతం గర్భవతి అని, త్వరలోనే ఆమె తల్లి కాబోతున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. తన ఆరోగ్య పరిస్థితిని సాకుగా చూపి కోర్టులో బెయిల్ పొందేందుకు ఆమె ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ కేసును లోతుగా విచారిస్తున్న సిట్ (SIT) అధికారులు మాత్రం ఆమెను కస్టడీలోకి తీసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

టీసీఎస్‌లో ఏం జరిగింది? (కేసు నేపథ్యం):

టీసీఎస్ క్యాంపస్‌లో బలవంతపు మతమార్పిడులు, లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఇప్పటివరకు 9 ఫిర్యాదులు అందాయి. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఏడుగురు ఉద్యోగులను అరెస్ట్ చేశారు. వీరిలో ఆరుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. 2022 ఫిబ్రవరి నుంచి 2026 వరకు ఈ అఘాయిత్యాలు కొనసాగినట్లు బాధితులు పేర్కొన్నారు. 8 మంది మహిళా ఉద్యోగులు తమను సీనియర్లు శారీరకంగా, మానసికంగా వేధించారని ఫిర్యాదు చేశారు.

బాధితులు తమ గోడును హెచ్ఆర్ మేనేజ్‌మెంట్‌కు చెప్పుకున్నా, వారు పట్టించుకోకుండా విస్మరించారని బాధితులు ఆరోపించడం గమనార్హం. మతమార్పిడి వంటి సున్నితమైన అంశం కావడంతో పోలీసులు ఈ కేసును అత్యంత సీరియస్‌గా తీసుకున్నారు. నిదా ఖాన్ దొరికితే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story