Minor Student: 15 ఏళ్ల విద్యార్థితో కలిసి లక్నో హోటల్‌లో ప్రత్యక్షమైన టీచర్
Minor Student: ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో 26 ఏళ్ల మహిళా ఉపాధ్యాయురాలు 15 ఏళ్ల మైనర్ విద్యార్థితో కలిసి వెళ్లిపోయిన ఘటన కలకలం రేపింది.
Minor Student: 15 ఏళ్ల విద్యార్థితో కలిసి లక్నో హోటల్‌లో ప్రత్యక్షమైన టీచర్
Basti School Incident: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, సన్మార్గంలో నడిపించాల్సిన ఓ ఉపాధ్యాయురాలే దారితప్పి మైనర్ విద్యార్థితో కలిసి వెళ్లిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర కలకలం రేపింది. బస్తీ జిల్లాలో చోటుచేసుకున్న ఈ విస్తుపోయే ఉదంతం స్థానికంగానే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బాలుడి తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, మొబైల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా వారిద్దరినీ లక్నోలోని ఓ హోటల్‌లో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లా కప్తాన్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోధ్వా గ్రామంలో ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాలలో రూపాలి (26) అనే మహిళ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. గత ఏడాది కాలంగా అక్కడ విధులు నిర్వహిస్తున్న ఆమెకు, అదే పాఠశాలలో 11వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలుడితో పరిచయం ఏర్పడింది. ఆ బాలుడు పాఠశాల నిర్వాహకుడి కుమారుడే కావడం గమనార్హం. కొంతకాలంగా వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో నవంబర్ 21న ఉదయం సుమారు 7 గంటల సమయంలో బాలుడు ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అయితే, బాలుడితో కలిసి చదువుతున్న మరో విద్యార్థి ద్వారా ఉపాధ్యాయురాలు రూపాలి అతడిని తనతో తీసుకెళ్లినట్లు తల్లిదండ్రులకు సమాచారం అందింది.
దీంతో బాలుడి తండ్రి వెంటనే కప్తాన్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన మైనర్ కుమారుడిని ఉపాధ్యాయురాలు ప్రలోభపెట్టి తీసుకెళ్లిందని ఆరోపించారు. ఘటన తీవ్రతను దృష్టిలో ఉంచుకున్న పోలీసులు, రూపాలిపై భారతీయ న్యాయ సంహిత (BNS) కింద కిడ్నాప్ ఆరోపణలతో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్లు 5, 6 కింద కేసు నమోదు చేశారు.
ప్రత్యేక ఆపరేషన్ గ్రూప్ సహకారంతో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు, వారి మొబైల్ ఫోన్ లొకేషన్‌ను ట్రేస్ చేశారు. ఇద్దరూ లక్నోలో ఉన్నట్లు గుర్తించిన ప్రత్యేక బృందం అక్కడికి చేరుకుని, ఒక హోటల్‌లో వారిని అదుపులోకి తీసుకుంది. అనంతరం ఇద్దరినీ బస్తీకి తరలించారు.
బాలుడు మైనర్ కావడంతో పోలీసులు అతడిని బాలల సంక్షేమ కమిటీ ముందు హాజరుపరిచారు. నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించి, మానసిక స్థితిపై కౌన్సెలింగ్ ఇచ్చారు. నవంబర్ 25న చట్టపరమైన ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు, ఉపాధ్యాయురాలు రూపాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.
పాఠశాల నిర్వాహకుడి కుమారుడైన విద్యార్థిని, అదే బడిలో పనిచేసే ఉపాధ్యాయురాలు తీసుకెళ్లడం విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రత, ఉపాధ్యాయుల నైతిక బాధ్యతలపై మరోసారి పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.




