Telegram : టెలిగ్రామ్ కొత్త డార్క్ వెబ్.. ఢిల్లీ హైకోర్టుకు కేంద్రం సంచలన నివేదిక.!

Telegram : ప్రముఖ మెసేజింగ్ యాప్ 'టెలిగ్రామ్'పై కేంద్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఈ యాప్ ప్రస్తుతం "సరికొత్త డార్క్ వెబ్"గా మారిపోయిందని,

G Krishna
Published on: 18 Jun 2026 5:31 PM IST
Telegram
X

Telegram

Telegram : ప్రముఖ మెసేజింగ్ యాప్ 'టెలిగ్రామ్'పై కేంద్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఈ యాప్ ప్రస్తుతం "సరికొత్త డార్క్ వెబ్"గా మారిపోయిందని, నేరస్థులు, సైబర్ మోసగాళ్లు, తీవ్రవాద గ్రూపులు చట్టాల నుంచి తప్పించుకోవడానికి దీనిని విపరీతంగా వాడుతున్నారని కేంద్రం పేర్కొంది. టెలిగ్రామ్ ప్లాట్‌ఫారమ్‌లోని కొన్ని ఛానళ్లు, కంటెంట్‌పై ప్రభుత్వం తీసుకున్న చర్యలను సవాలు చేస్తూ దాఖలైన ఒక కేసు విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ నివేదికలో టెలిగ్రామ్ ద్వారా జరుగుతున్న చట్టవిరుద్ధ కార్యకలాపాలను కేంద్రం సవివరంగా కోర్టుకు వివరించింది.

అక్రమ దందాలకు అడ్డాగా టెలిగ్రామ్

టెలిగ్రామ్ కేవలం సందేశాలు పంపుకునే యాప్‌లా కాకుండా, దేశంలో అనేక చట్టవిరుద్ధ కార్యకలాపాలకు కీలక వేదికగా రూపాంతరం చెందిందని కేంద్రం ఆరోపించింది. నీట్ (NEET) వంటి ప్రతిష్టాత్మక పరీక్షల పేపర్లు లీక్ చేయడం, సైబర్ మోసాలు, ఉగ్రవాద ప్రచారం, చైల్డ్ పోర్న్ కంటెంట్ వ్యాప్తి, డ్రగ్స్ సరఫరా, ఆర్థిక నేరాలకు ఈ యాప్ అడ్డాగా మారిందని ప్రభుత్వం తెలిపింది. నేరస్థులు టెలిగ్రామ్ ఛానళ్లలో లింక్‌లను పోస్ట్ చేస్తూ, వాటి ద్వారా డీప్ వెబ్ లింక్‌ల సాయంతో డార్క్ వెబ్ ఫోరమ్‌లకు కనెక్ట్ అవుతున్నారని, దీనివల్ల వారిని గుర్తించడం అధికారులకు అత్యంత కష్టతరంగా మారుతోందని పేర్కొంది.

గోప్యత ఫీచర్లే నేరగాళ్లకు వరం

టెలిగ్రామ్‌లో ఉండే విపరీతమైన ప్రైవసీ, ఆనానిమిటీ ఫీచర్లే నేరస్థులను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. వినియోగదారులు తమ ఫోన్ నంబర్లు, టెలిగ్రామ్ ఐడీలను ఇతరులకు కనిపించకుండా దాచుకునే సదుపాయం ఉండటం వల్ల, దర్యాప్తు సంస్థలు ఆయా అకౌంట్ల వెనుక ఉన్న అసలు వ్యక్తుల గుర్తింపును కనుగొనలేకపోతున్నాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది.

తీవ్రవాద ప్రచారం..

సమాజంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి, ప్రజా శాంతికి భంగం కలిగించడానికి ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న శక్తులు టెలిగ్రామ్ గ్రూపులను వాడుకుంటున్నాయని ప్రభుత్వం తెలిపింది. వారు హింసాత్మక, తీవ్రవాద కంటెంట్‌ను ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. వీటన్నింటికంటే మించి, చైల్డ్ పోర్న్, దుర్వినియోగానికి సంబంధించిన కంటెంట్ (CSEAM) ఈ ఛానళ్లలో విచ్చలవిడిగా చలామణి కావడం ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లను పర్యవేక్షించే ఏజెన్సీలకు పెద్ద సవాలుగా మారిందని కేంద్రం ఆవేదన వ్యక్తం చేసింది.

సైబర్ మోసాలు - మ్యూల్ బ్యాంక్ ఖాతాల విక్రయం

నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ డేటా ప్రకారం, టెలిగ్రామ్ ద్వారా జరిగే సైబర్ మోసాలపై ఫిర్యాదులు భారీగా పెరిగాయి. సైబర్ నేరగాళ్లు నకిలీ ఐడీలతో అకౌంట్లు తెరిచి ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారని, డేటా బ్రీచ్‌లను పబ్లిష్ చేస్తున్నారని కేంద్రం తెలిపింది. అలాగే, సైబర్ నేరాల ద్వారా వచ్చే డబ్బును , మనీ లాండరింగ్ సొమ్మును బదిలీ చేయడానికి ఉపయోగించే 'మ్యూల్ బ్యాంక్ ఖాతాల' (Mule Bank Accounts) కొనుగోళ్లు, అమ్మకాలు కూడా టెలిగ్రామ్ ఛానళ్లలోనే జోరుగా సాగుతున్నాయని ప్రభుత్వం ఫ్లాగ్ చేసింది.

వ్యక్తిగత డేటా చోరీ.. మాల్వేర్ నియంత్రణ

హ్యాకర్లు, సైబర్ ముఠాలు దాడులను ప్లాన్ చేయడానికి, దొంగిలించిన డేటాను పంపిణీ చేయడానికి టెలిగ్రామ్‌ను వేదికగా చేసుకున్నాయి. కొన్ని ప్రమాదకరమైన ఆండ్రాయిడ్ అప్లికేషన్లు బాధితుల డేటాను, పరికర సమాచారాన్ని దొంగిలించడానికి టెలిగ్రామ్‌ను కమాండ్-అండ్-కంట్రోల్ ప్లాట్‌ఫారమ్‌గా వాడుకుంటున్నట్లు కేంద్రం వెల్లడించింది. గూగుల్ ప్లే ప్రొటెక్ట్‌ను బైపాస్ చేసే టూల్స్, ఆర్థిక అప్లికేషన్లలా నటించే మాల్వేర్‌లను టెలిగ్రామ్ ఛానళ్లలో ప్రకటిస్తున్నారని ఉదాహరణలతో సహా పేర్కొంది. అంతేకాకుండా, గతంలో లీకైన డేటాబేస్‌ల నుండి సేకరించిన పౌరుల మొబైల్ నంబర్లు, ప్రభుత్వ గుర్తింపు కార్డుల వివరాలు , ఇతర సున్నితమైన సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి టెలిగ్రామ్ బాట్‌లు (Bots) దోహదపడుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.

పైరసీ, మేధో సంపత్తి హక్కుల ఉల్లంఘన

కేవలం సైబర్ నేరాలే కాకుండా, టెలిగ్రామ్ ఛానళ్లు కాపీరైట్ ఉన్న కంటెంట్‌ను విపరీతంగా పైరసీ చేస్తున్నాయని కేంద్రం పేర్కొంది. కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లను అక్రమంగా డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల కంటెంట్ క్రియేటర్లకు భారీ నష్టాలు వాటిల్లుతున్నాయని, ఇది మేధో సంపత్తి హక్కుల (Intellectual Property Rights) ఉల్లంఘన కిందికి వస్తుందని అఫిడవిట్‌లో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ అఫిడవిట్ ఆధారంగా ఢిల్లీ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story