నీట్ పరీక్ష వేళ టెలిగ్రామ్‌పై కేంద్రం ఆంక్షలు.. మరి వాట్సాప్‌కు మినహాయింపు ఎందుకు?
Telegram: నీట్ ప్రశ్నాపత్రం లీక్ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
నీట్ పరీక్ష వేళ టెలిగ్రామ్‌పై కేంద్రం ఆంక్షలు.. మరి వాట్సాప్‌కు మినహాయింపు ఎందుకు?
Telegram: నీట్ ప్రశ్నాపత్రం లీక్ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రీ-ఎగ్జామ్ కారణంగా జూన్ 22 వరకు టెలిగ్రామ్ సేవలపై తాత్కాలిక ఆంక్షలు విధించింది. అయితే వాట్సాప్‌కు ఎందుకు మినహాయించారో తెలుసా.?
నీట్ మోసాలకు కేంద్రంగా మారిన టెలిగ్రామ్ ఛానెల్స్
జాతీయ పరీక్షల సంస్థ (NTA) నివేదిక ఆధారంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) ఈ నిర్ణయం తీసుకుంది. దర్యాప్తు సంస్థల ప్రకారం, "PAPER LEAKED NEET", "Re-NEET 2026", "Private Mafia" వంటి పేర్లతో నడిచిన కొన్ని టెలిగ్రామ్ ఛానెల్స్ విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్నాయి. ప్రశ్నాపత్రాలు ముందుగానే ఇస్తామని, పరీక్షలో విజయం ఖాయం చేస్తామని చెప్పి వేల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసే ప్రయత్నాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పరీక్ష నిర్వహణపై ప్రభావం పడకుండా ముందస్తు చర్యగా టెలిగ్రామ్‌ప: తాత్కాలికంగా ఆంక్షలు విధించారు.
మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌పై ప్రభుత్వ ఆందోళన
టెలిగ్రామ్ లో ఉన్న మసేజ్ ఎడిటింగ్ ఫీచర్ కూడా అధికారుల దృష్టిని ఆకర్షించింది. ఒకసారి పంపిన సందేశాన్ని తర్వాత సవరించినా, అసలు టైమ్ స్టాంప్ అలాగే ఉంటుంది. దీన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. పరీక్ష పూర్తయ్యాక అసలు ప్రశ్నాపత్రాన్ని అప్‌లోడ్ చేసి, అది ముందుగానే పంపినట్లుగా చూపించే అవకాశం ఉండటంతో విద్యార్థుల్లో గందరగోళం ఏర్పడుతోంది. అందుకే భారత్‌లో టెలిగ్రామ్ మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను కూడా జూన్ 30 వరకు నిలిపివేయాలని ఆదేశించినట్లు సమాచారం.
భారీ పబ్లిక్ ఛానెల్స్ కారణంగా వేగంగా వ్యాప్తి
టెలిగ్రామ్‌లో లక్షలాది మంది సభ్యులతో పబ్లిక్ ఛానెల్స్, గ్రూపులు సులభంగా నిర్వహించవచ్చు. ఒకసారి సమాచారం పోస్టు చేస్తే అది దేశవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తుంది. అంతేకాకుండా, ఛానెల్ నిర్వాహకులు తమ అసలు గుర్తింపును దాచుకునే అవకాశం కూడా టెలిగ్రామ్‌లో ఎక్కువగా ఉంటుంది. ఈ కారణాల వల్ల పరీక్షల మోసాలకు సంబంధించిన నెట్‌వర్క్‌లు టెలిగ్రామ్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నాయని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి.
విద్యార్థులను సులభంగా చేరే అవకాశం
టెలగ్రామ్‌లో సెర్చ్ ద్వారా పబ్లిక్ ఛానెల్స్‌ను సులభంగా కనుగొనవచ్చు. "నీట్ లీక్", "ఎక్సమ్ పేపర్" వంటి కీవర్డ్స్‌తో వెతికితే అనుమానాస్పద గ్రూపులు కనిపించే అవకాశం ఉంటుంది. దీంతో ప్రశ్నాపత్రాల కోసం వెతికే విద్యార్థులను మోసగాళ్లు త్వరగా చేరుకోగలుగుతున్నారని అధికారులు చెబుతున్నారు. లింకులు, ఫార్వర్డ్స్ ద్వారా సమాచారం విస్తృతంగా వ్యాపించడం కూడా టెలిగ్రామ్‌పై ఆంక్షలు విధించడానికి ఒక కారణమైంది.
వాట్సాప్‌పై చర్యలు ఎందుకు లేవు.?
ప్రస్తుత NEET దర్యాప్తులో వాట్సాప్ పాత్రపై ప్రభుత్వం ఎలాంటి ఆరోపణలు చేయలేదు. వాట్సాప్‌లో ఎక్కువగా ఫోన్ నంబర్ల ఆధారంగా వ్యక్తిగత చాట్లు, ప్రైవేట్ గ్రూపుల ద్వారా కమ్యూనికేషన్ జరుగుతుంది. టెలిగ్రామ్‌లాగా భారీ పబ్లిక్ ఛానెల్స్ వ్యవస్థ వాట్సాప్‌లో లేదు. అందువల్ల పెద్ద స్థాయిలో సమాచారాన్ని వ్యాప్తి చేయడం టెలిగ్రామ్‌తో పోలిస్తే పరిమితంగానే ఉంటుంది. దర్యాప్తు సంస్థల ప్రకారం, ప్రస్తుతం పరిశీలనలో ఉన్న మోసపూరిత నెట్‌వర్క్‌లు ప్రధానంగా టెలిగ్రామ్‌లోనే కార్యకలాపాలు నిర్వహించాయి. అందుకే టెలిగ్రామ్‌పై మాత్రమే తాత్కాలిక ఆంక్షలు విధించారు.
పరీక్షల విశ్వసనీయత కాపాడేందుకే చర్య
కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన ప్రకారం ఇది టెలిగ్రామ్‌పై శాశ్వత నిషేధం కాదు. జూన్ 21న జరగనున్న NEET రీ-ఎగ్జామ్‌ను పారదర్శకంగా నిర్వహించేందుకు, విద్యార్థులు తప్పుడు సమాచారం బారిన పడకుండా ఉండేందుకు తీసుకున్న తాత్కాలిక చర్య మాత్రమే. పరీక్ష పూర్తయ్యాక పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.




