TG Mohandas : విద్యార్థినులను కించపరుస్తూ అసభ్యకర వ్యాఖ్యలు.. మోహన్‌దాస్ అరెస్ట్.!

నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా విద్యార్థులు చేపట్టిన నిరసనలపై అత్యంత హేయమైన, హింసాత్మక వ్యాఖ్యలు చేసిన..

G Krishna
Published on: 10 Aug 2026 12:30 PM IST
tg mohandas
X

tg mohandas

నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా విద్యార్థులు చేపట్టిన నిరసనలపై అత్యంత హేయమైన, హింసాత్మక వ్యాఖ్యలు చేసిన ప్రముఖ రైట్‌వింగ్ విశ్లేషకుడు టి.జి. మోహన్‌దాస్‌ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. కొచ్చిలోని ఆయన నివాసంలో ఆదివారం రాత్రి ఆకస్మికంగా అదుపులోకి తీసుకున్న తిరువనంతపురం సైబర్ క్రైమ్ పోలీసులు, సోమవారం ఉదయం ఆయన అరెస్ట్‌ను అధికారికంగా నమోదు చేశారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విద్యార్థుల ఆందోళనపై మోహన్‌దాస్ చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలు ప్రస్తుతం కేరళ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహజ్వాలలను, రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి.

యూట్యూబ్ వీడియోలో తీవ్ర విద్వేషం, అసభ్య వ్యాఖ్యలు

మోహన్‌దాస్ తన 'పత్రిక' అనే యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులను ఉద్దేశించి తీవ్రస్థాయిలో హద్దులు దాటి మాట్లాడారు. తన వద్ద అధికార బాధ్యతలు ఉంటే జంతర్ మంతర్ ప్రాంతంలో తక్షణమే కర్ఫ్యూ విధించి, అధికారుల హెచ్చరికల తర్వాత నేరుగా కాల్పులకు ఆదేశించేవాడినని స్పష్టం చేశారు. ఈ క్రమంలో కొందరు చనిపోయినా లేదా వికలాంగులైనా ఫర్వాలేదని, కేవలం నాలుగు గంటల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందంటూ బహిరంగంగా హింసను ప్రేరేపించే వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా, ఆందోళనల్లో పాల్గొంటున్న మహిళా విద్యార్థులను ఉద్దేశించి అత్యంత దిగజారిన రీతిలో, అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించారు. ఇలాంటి నిరసనల్లో పాల్గొనే మహిళలు గ్యాంగ్‌రేప్‌కు గురైనా పోలీసులకు ఫిర్యాదు చేయరని, ఎందుకంటే వారు లైంగిక దాడులను ఆస్వాదిస్తారంటూ తీవ్రంగా నోరు పారేసుకున్నారు.

కేసులు నమోదు.. డిజిటల్ సాక్ష్యాల స్వాధీనం

ఈ హేయమైన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డ విద్యార్థి సంఘాలు ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌ తక్షణమే తిరువనంతపురం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఈ ఫిర్యాదుల ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు.. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం , మహిళల ఆత్మగౌరవానికి తీవ్ర భంగం కలిగించడం వంటి తీవ్ర అభియోగాలపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు భారతీయ నగరక్షా సంహిత , ఐటీ చట్టంలోని పలు కఠిన సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సోదాల సందర్భంగా ఆయన నివాసం నుంచి వీడియో రికార్డింగ్‌కు , సోషల్ మీడియా ప్రసారాలకు ఉపయోగించిన స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని, తదుపరి సాంకేతిక విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.

విస్తరిస్తున్న రాజకీయ కలకలం.. ఖండించిన ఆర్‌ఎస్‌ఎస్

గతంలో మోహన్‌దాస్ భారతీయ జనతా పార్టీ మేధోవిభాగం కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన నేపథ్యం ఉండటంతో, ఆయన అరెస్ట్ కేరళ రాజకీయాల్లో పెద్ద కలకలమే రేపింది. అయితే, మోహన్‌దాస్ చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆర్‌ఎస్‌ఎస్ స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. ఆ వీడియోలో వ్యక్తమైనవి కేవలం మోహన్‌దాస్ వ్యక్తిగత అభిప్రాయాలని, వాటిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తేల్చిచెప్పింది. మరోవైపు, ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుల ప్రాథమిక హక్కులను, మహిళల గౌరవాన్ని చులకన చేస్తూ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే వారిపై చట్టపరంగా అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎం.వి.గోవిందన్ డిమాండ్ చేశారు. సదరు వివాదాస్పద వీడియోను యూట్యూబ్ ప్లాట్‌ఫామ్ నుంచి తక్షణమే తొలగించేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన పోలీసులను కోరారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story