Stalin On Cm Vijay Thalapathy: తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. స్టాలిన్ సెటైరికల్ విష్!
Stalin On Cm Vijay Thalapathy: తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం. సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేసిన దళపతిపై మాజీ సీఎం ఎంకే స్టాలిన్ సెటైర్లు.
Stalin On Cm Vijay Thalapathy: తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. స్టాలిన్ సెటైరికల్ విష్!
Stalin On Cm Vijay thalapathy: తమిళనాడు రాజకీయాల్లో భారీ మార్పు చోటుచేసుకుంది. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన అట్టహాసమైన కార్యక్రమంలో TVK అధినేత విజయ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఆయనతో ప్రమాణము చేయించారు. చిన్న పార్టీల మద్దతుతో 120 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలంతో విజయ్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు విజయ్ కుటుంబ సభ్యులు, నటి త్రిషతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం విజయ్ తన తొలి ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం ప్రస్తుతం రూ. 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని, ఖజానా ఖాళీ అయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. "నేనేమీ దేవదూతను కాదు.. మీలాంటి సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వాడినే. ఆకలి, పేదరికం విలువ నాకు తెలుసు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నెరవేరుస్తా" అని స్పష్టం చేశారు.
విజయ్ ప్రసంగంపై మాజీ సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విభిన్నంగా స్పందించారు. ముందుగా విజయ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూనే.. పరిపాలనపై చురకలు అంటించారు."ప్రభుత్వం దగ్గర నిధులు లేవని అప్పుడే సాకులు చెప్పకండి. అక్కడ అన్నీ ఉన్నాయి, కావాల్సింది కేవలం పరిపాలించే సంకల్పం మాత్రమే" అని స్టాలిన్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర అప్పులు అనుమతించదగిన పరిమితిలోనే ఉన్నాయని, బడ్జెట్ గణాంకాలు తెలియవా? అని ప్రశ్నించారు.
కోవిడ్, వరదలు, కేంద్రం నుంచి ఎదురైన ఇబ్బందులను అధిగమించి తాము సంక్షేమ పథకాలు అమలు చేశామని గుర్తు చేస్తూ.. ప్రజలను మోసం చేయవద్దని విజయ్‌కు సూచించారు. "హామీలను ఎలా నెరవేర్చాలో మీరు కూడా త్వరలోనే నేర్చుకుంటారని ఆశిస్తున్నా" అంటూ స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
మొత్తానికి విజయ్ ముఖ్యమంత్రిగా అడుగుపెట్టడమే అప్పుల వివాదంతో మొదలవ్వడం, దానికి స్టాలిన్ ధీటుగా బదులివ్వడం చూస్తుంటే రాబోయే రోజుల్లో తమిళ పాలిటిక్స్ మరింత హీటెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.




