Tamil Nadu: తిరుపరంకుండ్రం దీపం వివాదం.. సుప్రీం అనుమతించినా వెలగని దీపం..!

Tamil Nadu: మదురైలోని తిరుపరంకుండ్రం కొండపై ఉన్న వివాదాస్పద దీపతూన్ స్తంభం వద్ద కార్తీక దీపం వెలిగించేందుకు ఆలయ నిర్వహణ విభాగం అనుమతి.

G Krishna
Published on: 25 Nov 2026 1:39 PM IST
Tamil Nadu
X

Tamil Nadu: తిరుపరంకుండ్రం దీపం వివాదం.. సుప్రీం అనుమతించినా వెలగని దీపం..!

Tamil Nadu: మదురైలోని తిరుపరంకుండ్రం కొండపై ఉన్న వివాదాస్పద దీపతూన్ స్తంభం వద్ద కార్తీక దీపం వెలిగించేందుకు ఆలయ నిర్వహణ విభాగం అనుమతి ఇవ్వలేదని తమిళనాడు ప్రభుత్వ అధికారులు బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపారు. నవంబర్ 24 మంగళవారం దీపం వెలిగించేందుకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు దాఖలు చేసిన కంప్లయెన్స్ రిపోర్టులో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ప్రతి ఏటా దీపం వెలిగించేందుకు వీలు కల్పిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన విస్తృత తీర్పును సుప్రీంకోర్టు నిలిపివేసినప్పటికీ, నవంబర్ 24న మాత్రం ఒక్కసారిగా దీపం వెలిగించేందుకు అనుమతించింది.

కలెక్టర్ అఫిడవిట్.. ఆలయ నిర్వహణ విభాగం వాదన ఏంటి?

దర్గాకు దగ్గరగా ఉన్న దీపతూన్ స్తంభంపై దీపం వెలిగించడం సంప్రదాయం కాదన్న తమిళనాడు ప్రభుత్వ వాదనను హిందూ సంఘాలు సవాల్ చేయడంతో ఈ వ్యవహారం వివాదంగా మారింది. వేడుక ఏర్పాట్లను పర్యవేక్షించిన మదురై కలెక్టర్ కృష్ణ కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో, కోర్టు ఆదేశాలను పాటించడానికి తాను అన్ని విధాలుగా ప్రయత్నించానని పేర్కొన్నారు. అయితే ఆచారాలు, సంప్రదాయాలకు విరుద్ధమంటూ దీపతూన్‌పై దీపం వెలిగించేందుకు ఆలయ నిర్వహణ విభాగం ఒప్పుకోలేదని తెలిపారు. దీనివల్ల మంగళవారం నాడు సాధారణంగా దీపం వెలిగించే ఉచ్చిపిళ్లైయార్ ఆలయం సమీపంలోనే దీపం వెలిగించారని, దీపతూన్ వద్ద వెలిగించలేదని వివరించారు.

కోర్టును తప్పుదోవ పట్టించారంటూ పిటిషనర్ ఆరోపణలు

వేడుకకు ఒక్కరోజు ముందు సుప్రీంకోర్టు ఆదేశాలు పాటిస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఇలా చెప్పడం ద్వారా తమిళనాడు ప్రభుత్వం కోర్టును తప్పుదోవ పట్టించిందని మద్రాస్ హైకోర్టు పిటిషనర్లలో ఒకరైన రామా రవికుమార్ ఆరోపించారు. దీపతూన్ వద్ద దీపం వెలిగించకుండా ఆలయ ట్రస్టీల బోర్డును వాడుకున్నారని పేర్కొంటూ, ఆదేశాల ఉల్లంఘనపై ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే సుప్రీంకోర్టు మాత్రం తనంతట తానుగా ధిక్కార చర్యలు మొదలుపెట్టేందుకు నిరాకరించింది. పిటిషనర్లు అధికారికంగా పిటిషన్ దాఖలు చేయాలని సూచిస్తూ, అవసరమైతే తగిన ఉత్తర్వులు ఇస్తామని స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌ను త్వరలోనే దాఖలు చేస్తామని, మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రస్తావించేందుకు అనుమతి ఇవ్వాలని సీనియర్ న్యాయవాది గురు కృష్ణకుమార్ ధర్మాసనాన్ని కోరారు.

నవంబర్ 20 ఆదేశాలు.. కొండపై కట్టుదిట్టమైన భద్రత

అంతకుముందు నవంబర్ 20న సుప్రీంకోర్టు ఒక కీలక ఆదేశం ఇచ్చింది. నవంబర్ 24న ఒకసారి మాత్రమే ఆలయ నిర్వహణ విభాగం అనుమతి ఇచ్చిన చిన్న బృందంతో దీపతూన్ వద్ద దీపం వెలిగించవచ్చని అనుమతించింది. ఏర్పాట్లను పర్యవేక్షించి, పండుగ ముగిసిన మూడు రోజుల్లోపు కంప్లయెన్స్ రిపోర్టు సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. కానీ మంగళవారం ఉచ్చిపిళ్లైయార్ ఆలయం దగ్గర ఉన్న దీప మండపంలో మాత్రమే దీపం వెలిగించగా, వివాదాస్పద దీపతూన్ స్తంభం వద్ద దీపం వెలిగించలేదు. ట్రస్టీలంతా కలిసి ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం మేరకే ఉచ్చిపిళ్లైయార్ ఆలయం వద్ద సంప్రదాయ పద్ధతిలో దీపం వెలిగించామని ఆలయ నిర్వహణ విభాగం తెలిపింది.

దీపతూన్ అనేది బ్రిటిష్ కాలంలో పాతిన సర్వే రాయి మాత్రమేనని, ఆలయ సంప్రదాయాలకు సంబంధించిన వివరాలను సుప్రీంకోర్టు ముందు ఉంచుతామని స్పష్టం చేసింది. మరోవైపు పీటీఐ సమాచారం ప్రకారం, తిరుపరంకుండ్రం కొండ చుట్టూ బుధవారం కూడా భద్రత కట్టుదిట్టంగా ఉంది. వరుసగా రెండో రోజు భక్తులు, ప్రజలను కొండ పైకి వెళ్లకుండా నిలువరించారు. నవంబర్ 23 సాయంత్రం 6 గంటల నుంచే ఆంక్షలు అమల్లో ఉండగా, పళని ఆండవర్ ఆలయ ప్రవేశద్వారం వద్ద, కొండ పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు. కొండకు వెళ్లే దారిలో బారికేడ్లు పెట్టి, స్థానికులను మాత్రమే అనుమతిస్తున్నారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.