ముగ్గురు అక్కాచెల్లెళ్లకు ఒకే భర్త.. వైరల్‌గా మారిన వివాహం!
ఉత్తర్‌ప్రదేశ్‌లో సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లైన ముగ్గురు యువతులు ఒకే కెమెరామెన్‌ను వివాహం చేసుకోవడం చర్చనీయాంశమైంది.
Viral Marriage
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ అసాధారణ వివాహం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలు చేస్తూ గుర్తింపు పొందిన ముగ్గురు యువతులు తమ వీడియోలను చిత్రీకరించే కెమెరామెన్‌ను వివాహం చేసుకోవడం వైరల్‌గా మారింది.
అమ్రోహా జిల్లాలోని ధౌరియా గ్రామానికి చెందిన అల్కా, దేవిక, సంతోష్ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ రీల్స్, వీడియో కంటెంట్ రూపొందిస్తుంటారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి వేదికల్లో వీరికి మంచి ఫాలోయింగ్ ఉంది. అదే జిల్లాలోని శ్యాంపురి గ్రామానికి చెందిన వికాస్ అనే యువకుడు వీరి వీడియోలను చిత్రీకరిస్తుండేవాడు. కొన్ని వీడియోల్లో భర్త పాత్రలో కూడా నటించినట్లు సమాచారం.
స్థానికంగా వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, పెళ్లి తర్వాత విడివిడిగా కుటుంబాల్లోకి వెళ్లాల్సి వస్తుందనే ఆలోచనతో ముగ్గురూ కలిసి ఉండాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం స్థానికంగా ప్రసిద్ధి చెందిన ఆలయంలో వికాస్‌ను వివాహం చేసుకున్నట్లు సమాచారం.
ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ పెళ్లికి ఇరు కుటుంబాలు దూరంగా ఉన్నట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి. ఘటనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, కొందరు విమర్శలు కూడా చేశారు.
దీనిపై స్పందించిన యువతులు వీడియో విడుదల చేసి తమ నిర్ణయం తమ వ్యక్తిగత విషయమని, జీవితాంతం కలిసి ఉండాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ వ్యవహారంపై స్థానిక పోలీసులు విచారణ చేపట్టగా, యువతులు ఇదే విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, ముగ్గురు యువతుల్లో ఇద్దరు సొంత అక్కాచెల్లెళ్లు కాగా, మరో యువతి వరుసకు సోదరి అని, చిన్నప్పటి నుంచి ఒకే ఇంట్లో కలిసి పెరిగినట్లు స్థానిక సమాచారం వెల్లడిస్తోంది.




