Koel Mallick: టీఎంసీకి మరో దెబ్బ.. రాజ్యసభ సభ్యత్వానికి కోయల్ మల్లిక్ రాజీనామా!
Koel Mallick: తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
Koel Mallick: టీఎంసీకి మరో దెబ్బ.. రాజ్యసభ సభ్యత్వానికి కోయల్ మల్లిక్ రాజీనామా!
Koel Mallick: తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీలో వలసల పరంపర కొనసాగుతూనే ఉంది. పార్టీ అంతర్గత పరిణామాల నేపథ్యంలో మమతా బెనర్జీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ నటి, టీఎంసీ ఎంపీ కోయల్ మల్లిక్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
కేవలం నాలుగు నెలల కిందటే (ఏప్రిల్‌లో) ఆమె టీఎంసీ తరఫున రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పదవి చేపట్టిన ఇంత తక్కువ కాలంలోనే, కనీసం ఒక్క సభకు కూడా హాజరుకాకుండానే ఆమె తన పదవికి హఠాత్తుగా రాజీనామా సమర్పించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. గురువారం మధ్యాహ్నం రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌ను స్వయంగా కలుసుకున్న కోయల్ మల్లిక్.. తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. అయితే, తన రాజీనామాకు గల స్పష్టమైన కారణాలను ఆమె ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పరాజయం తర్వాత టీఎంసీలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. బుధవారం నాడే మమతా బెనర్జీకి అత్యంత ఆప్తుడు, సీనియర్ ఎమ్మెల్యే అయిన మదన్ మిత్ర పార్టీని వీడి, రితబ్రతా బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గంలో చేరారు. ఈ పరిణామం జరిగిన మరుసటి రోజే ఎంపీ కోయల్ మల్లిక్ కూడా రాజీనామా చేయడం గమనార్హం.
ఇప్పటికే సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితా దేవ్, ప్రకాష్ చిక్ బారైక్ వంటి సీనియర్ ఎంపీలు రాజీనామా చేసి బీజేపీ గూటికి చేరగా.. ఇప్పుడు కోయల్ మల్లిక్ కూడా అదే బాటలో పయనిస్తారనే ప్రచారం జోరందుకుంది. రాజీనామా చేసిన వెంటనే ఆమె కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌తో భేటీ కావడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది. కోయల్ రాజీనామాతో ప్రస్తుతం ఎగువ సభలో టీఎంసీ బలం కేవలం 9 స్థానాలకు పడిపోయింది.




