Tamil Nadu: సీఎం విజయ్ మారథాన్ రన్.. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా 6 కిలోమీటర్లు పరుగు!

Tamil Nadu: అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చెన్నైలో నిర్వహించిన 'స్టాప్ డ్రగ్స్' మారథాన్‌లో స్వయంగా పాల్గొన్నారు.

Arun Chilukuri
Published on: 26 Jun 2026 12:24 PM IST
Tamil Nadu
X

Tamil Nadu: సీఎం విజయ్ మారథాన్ రన్.. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా 6 కిలోమీటర్లు పరుగు!

Tamil Nadu: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సరికొత్త పంథాలో యువతకు ఆదర్శంగా నిలిచారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని తమిళనాడు ప్రభుత్వం శుక్రవారం చెన్నై నగరంలో ఒక భారీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘స్టాప్ డ్రగ్స్’ (Stop Drugs Marathon) మారథాన్‌లో సీఎం విజయ్ స్వయంగా పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు. యువతలో జోష్ నింపుతూ ఆయన ఏకంగా 6 కిలోమీటర్ల మేర నాన్‌స్టాప్‌గా పరుగెత్తారు.

ఈ వినూత్న మారథాన్ ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి విజయ్ అక్కడ గుమిగూడిన వేలాది మందితో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, స్వచ్ఛంద సంస్థల వాలంటీర్లు, విద్యార్థులతో పాటు వేలాది మంది క్రీడా ఔత్సాహికులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా ట్రాక్ సూట్ వేసుకుని పరుగెత్తడంతో మారథాన్‌లో భారీ కోలాహలం నెలకొంది.

మారథాన్ అనంతరం సీఎం విజయ్ యువతను ఉద్దేశించి కీలక సందేశాన్ని ఇచ్చారు. యువత అంతా మాదకద్రవ్యాల (డ్రగ్స్) మహమ్మారికి దూరంగా ఉండాలని, శారీరక దృఢత్వం కోసం ప్రతిరోజు తప్పకుండా రన్నింగ్‌ లేదా వ్యాయామం చేయాలని పిలుపునిచ్చారు.

"మాదకద్రవ్యాల వల్ల జీవితాలు ఎలా నాశనమవుతాయో, వాటి వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి మీ కుటుంబసభ్యులకు, స్నేహితులకు వివరించి అవగాహన కల్పించండి. తమిళనాడు రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు మా ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలకు ప్రజలందరూ పూర్తి మద్దతు ఇవ్వాలి" అని సీఎం విజయ్ కోరారు.

రాష్ట్ర ప్రజలను ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు ప్రోత్సహించడానికి, అలాగే డ్రగ్స్ లేని తమిళనాడును నిర్మించడానికి ప్రభుత్వం తరఫున రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇలాంటి మారథాన్‌లు, మినీ మారథాన్‌లు పెద్ద ఎత్తున నిర్వహించినట్లు ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story