TamilNadu Politics : తమిళనాడు పీఠంపై సందిగ్ధత.. విజయ్ కింగ్ అవుతారా? కింగ్ మేకర్లే దిక్కు అవుతారా?
TamilNadu Politics : తమిళనాడులో విజయ్ సీఎం అవుతారా? 118 మెజారిటీ మార్కు కోసం టీవీకే ఆరాటపడుతోంది. గవర్నర్ ఫ్లోర్ టెస్ట్ అధికారాలు, రాజ్యాంగ పరమైన చిక్కుల గురించి తెలుసుకుందాం.
Thalapathy Vijay
TamilNadu Politics : తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు అసలైన సినిమా కనిపిస్తోంది. వెండితెరపై రికార్డులు తిరగరాసిన తలపతి విజయ్, ఇప్పుడు అసెంబ్లీలో మెజారిటీ మార్కును అందుకోవడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. అరంగేట్రం చేసిన తొలి ఎన్నికల్లోనే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, అధికారం దక్కించుకోవడానికి అవసరమైన ఆ మ్యాజిక్ నంబర్ దగ్గరే కథ అగిపోయింది. గవర్నర్ పెట్టిన కండిషన్లు, రాజ్యాంగపరమైన చర్చలతో తమిళ పాలిటిక్స్ హాట్ హాట్‌గా మారాయి.
అసలు ఏం జరుగుతోంది?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తలపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) 108 స్థానాలను గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా విజయ్‌కు మద్దతు ప్రకటించడంతో ఆ సంఖ్య 113కు చేరింది. అయితే, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజారిటీ మార్కు 118. అంటే విజయ్ ముఖ్యమంత్రి కావడానికి ఇంకా కనీసం ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో విజయ్ వరుసగా రెండో రోజు కూడా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిశారు. అయితే 118 మంది మద్దతు లేఖ ఉంటేనే ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానిస్తానని గవర్నర్ స్పష్టం చేయడంతో ఉత్కంఠ నెలకొంది.
గవర్నర్‌కు ఫ్లోర్ టెస్ట్ అధికారం ఉందా?
సాధారణంగా ప్రభుత్వం ఏర్పాటుకు ముందు గవర్నర్ చేసే ప్రాథమిక అంచనాపై ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. రాజ్యాంగం ప్రకారం గవర్నర్‌కు విచక్షణాధికారం ఉంటుంది. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం.. గవర్నర్ రాజ్‌భవన్‌లో ఫ్లోర్ టెస్ట్ నిర్వహించలేరు. అంటే ఎమ్మెల్యేలందరినీ పిలిచి అక్కడే ఓటింగ్ పెట్టడం కుదరదు. అయితే, ఒక పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే సత్తా ఉందా లేదా అని ప్రాథమికంగా సంతృప్తి చెందడం గవర్నర్ బాధ్యత. అందుకే విజయ్‌ను మెజారిటీ మార్కు నిరూపించుకోమని ఆయన అడుగుతున్నారు.
ఎస్.ఆర్. బొమ్మై కేసు తీర్పు ఏం చెబుతోంది?
1994 నాటి ప్రసిద్ధ ఎస్.ఆర్. బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు ఇచ్చింది. ఒక పార్టీకి మెజారిటీ ఉందో లేదో తేల్చడానికి సరైన వేదిక అసెంబ్లీ మాత్రమేనని కోర్టు స్పష్టం చేసింది. గవర్నర్ తన వ్యక్తిగత అభిప్రాయం మీద కాకుండా, అసెంబ్లీలోనే మెజారిటీని పరీక్షించాలని చెప్పింది. అదేవిధంగా, ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రానప్పుడు అతిపెద్ద పార్టీని ఆహ్వానించడం ఒక సంప్రదాయంగా వస్తోంది. ఇక్కడ విజయ్ పార్టీ అతిపెద్ద పార్టీగా ఉన్నందున ఆయనకే మొదటి అవకాశం ఇవ్వాలని టీవీకే మద్దతుదారులు వాదిస్తున్నారు.
విజయ్ ముందున్న దారులు
గవర్నర్ గారు మెజారిటీ లేఖ అడుగుతుండటంతో విజయ్ ఇప్పుడు ఇతర చిన్న పార్టీలు లేదా స్వతంత్రుల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ గవర్నర్ గనుక విజయ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయమని పిలిస్తే, ఆయనకు ఒక నిర్ణీత సమయం ఇస్తారు. ఆ లోపు అసెంబ్లీలో ఓటింగ్ ద్వారా తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. 2006 నాటి రామేశ్వర్ ప్రసాద్ కేసులో కూడా సుప్రీంకోర్టు గవర్నర్ నిర్ణయం ప్రాథమికమైనదే కానీ తుది నిర్ణయం కాదని తేల్చి చెప్పింది. ప్రస్తుతానికి విజయ్ ఆ మ్యాజిక్ ఫిగర్ 118ని ఎలా అందుకుంటారన్నదే అసలైన సస్పెన్స్.




