Maharashtra: మహారాష్ట్రలో ఘోరం.. అడవికి వెళ్లిన నలుగురు మహిళలను వేటాడి చంపిన పులి!

Maharashtra: మహారాష్ట్రలోని చంద్రపుర్ జిల్లాలో ఘోర విషాదం నెలకొంది. గంజేవాహి అటవీ ప్రాంతంలో బీడీ ఆకులు ఏరుకోవడానికి వెళ్లిన నలుగురు మహిళలపై పులి దాడి చేసి కిరాతకంగా చంపేసింది.

Arun Chilukuri
Published on: 22 May 2026 2:48 PM IST
Maharashtra
X

Maharashtra: మహారాష్ట్రలో ఘోరం.. అడవికి వెళ్లిన నలుగురు మహిళలను వేటాడి చంపిన పులి!

Maharashtra: మహారాష్ట్రలోని చంద్రపుర్ జిల్లాలో గుండెలవిసే ఘోర దురంతం చోటుచేసుకుంది. అడవిలోకి వెళ్లిన నలుగురు గ్రామీణ మహిళలపై ఒకేసారి పులి దాడి చేసి ప్రాణాలు తీసింది. గంజేవాహి అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం జరిగిన ఈ భయంకర ఘటనతో చుట్టుపక్కల ఉన్న గిరిజన గూడాలు, గ్రామాల ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

చంద్రపుర్ జిల్లా సిందేవహి తాలుకా పరిధిలోని అటవీ ప్రాంత గ్రామ ప్రజలకు ప్రతిరోజూ ఉదయాన్నే అడవికి వెళ్లడం అలవాటు. అడవిలో దొరికే ఎండిపోయిన బీడీ ఆకులను (Tendu Leaves) ఏరుకుని, వాటిని అమ్మి జీవనం సాగిస్తుంటారు. నిత్యకృత్యంలో భాగంగానే శుక్రవారం ఉదయం గంజేవాహి ప్రాంతానికి చెందిన కొందరు మహిళలు గుంపుగా అడవిలోకి వెళ్లారు. ఉదయం 8 గంటల సమయంలో వీరంతా ఆకులు ఏరుకోవడంలో నిమగ్నమై ఉండగా, పొదల్లో నక్కిన పులి ఒక్కసారిగా వారిపై లంఘించింది.

మహిళలు అప్రమత్తమై ప్రాణాలు కాపాడుకునే లోపే పులి అత్యంత భయంకరంగా విరుచుకుపడింది. అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం.. సదరు మహిళలకు కనీసం తప్పించుకునేందుకు లేదా గట్టిగా కేకలు వేసే అవకాశం కూడా ఇవ్వకుండా పులి ఒకరి తర్వాత ఒకరిపై దాడి చేసి వేటాడింది. పులి పంజా విసిరిన దాడిలో తీవ్ర రక్తస్రావమై నలుగురు మహిళలు ఘటనా స్థలంలోనే విగతజీవులుగా పడిపోయారు.

ఒకేసారి నలుగురు మహిళలు పులి దాడిలో బలికావడంతో అటవీ ప్రాంత పరిసర గ్రామాల్లో తీవ్ర కలకలం రేగింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి (FRO) అంజలీ సాయంకర్‌ తన సిబ్బందితో కలిసి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. అయితే, ఈ ప్రాంతంలో పులుల సంచారంపై ముందస్తు హెచ్చరికలు చేయలేదని, అటవీ శాఖ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రాణాలు పోయాయంటూ స్థానిక గ్రామీణులు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని, నరభక్షక పులిని వెంటనే గుర్తించి బంధించాలని డిమాండ్ చేస్తూ అడవి బాటలో నిరసనకు దిగారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story