Mumbai: ఒకే ఇంట్లో నలుగురు మృతి.. బిర్యానీ, పుచ్చకాయ కాంబినేషన్ ప్రాణాంతకమా?
Mumbai: ముంబయిలో విషాదం: విందులో బిర్యానీ, ఇంటికి వచ్చాక పుచ్చకాయ తిన్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు 12 గంటల్లోనే మృతి చెందారు. ఫుడ్ పాయిజనింగ్ కారణంగానే ఈ మరణాలు సంభవించాయని పోలీసులు అనుమానిస్తున్నారు.
Mumbai: ఒకే ఇంట్లో నలుగురు మృతి.. బిర్యానీ, పుచ్చకాయ కాంబినేషన్ ప్రాణాంతకమా?
Mumbai: మహారాష్ట్ర రాజధాని ముంబయిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. బంధువుల ఇంట్లో విందు ఆరగించిన కొద్ది గంటల్లోనే ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. పోలీసులు ప్రాథమికంగా దీనిని 'ఫుడ్ పాయిజనింగ్' (Food Poisoning) గా భావిస్తున్నారు.
ముంబయిలోని పైధోనీ ప్రాంతంలో అబ్దుల్లా అబ్దుల్ కాదర్ (40) మొబైల్ దుకాణం నిర్వహిస్తూ తన భార్య నస్రీన్ (35), ఇద్దరు కుమార్తెలతో కలిసి నివసిస్తున్నారు. శనివారం రాత్రి వీరంతా బంధువుల ఇంటికి విందుకు వెళ్లారు. అక్కడ అందరితో కలిసి బిర్యానీ తిన్న ఈ కుటుంబం, ఇంటికి వచ్చిన తర్వాత అర్ధరాత్రి సమయంలో పుచ్చకాయను కూడా ఆరగించారు.
ఆదివారం తెల్లవారుజామున 5 గంటల నుంచి కుటుంబ సభ్యులందరికీ వరుసగా వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో అబ్దుల్లా వెంటనే స్థానిక వైద్యుడిని పిలిపించారు. పరిస్థితి విషమించడంతో వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఉదయం 10 గంటల కల్లా కుటుంబంలోని నలుగురూ కన్నుమూశారు. మృతుల్లో 13 ఏళ్ల బాలిక కూడా ఉండటం అందరినీ కలిచివేస్తోంది.
సమాచారం అందుకున్న పైధోనీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. బిర్యానీ లేదా పుచ్చకాయలో ఏదైనా విషపూరితం కావడం వల్ల 'ఫుడ్ పాయిజనింగ్' జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు.




