అరుణాచలంలో విషాదం.. మోక్ష మార్గంలో ఇరుక్కుపోయి భక్తుడు మృతి
Arunachalam: అరుణాచలం గిరిప్రదక్షిణ మార్గంలోని మోక్ష మార్గం గుహలో ఇరుక్కుపోయి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మణికుమార్ (36) అనే భక్తుడు ఊపిరాడక మృతిచెందాడు.
అరుణాచలంలో విషాదం.. మోక్ష మార్గంలో ఇరుక్కుపోయి భక్తుడు మృతి
Arunachalam: తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరుణాచలేశ్వర స్వామి ఆలయ గిరిప్రదక్షిణ మార్గంలో అత్యంత బాధాకరమైన ఘటన చోటుచేసుకుంది. భక్తిశ్రద్ధలతో దైవదర్శనం కోసం వచ్చిన ఓ భక్తుడు మోక్ష మార్గంగా పిలిచే గుహలో ఇరుక్కుపోయి, ఊపిరాడక ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా మరియు భక్తుల్లో తీవ్ర తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మణికుమార్ (36) అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం రాత్రి తిరువణ్ణామలైలోని శ్రీ ఉన్నాములయ్యమ్మన్ సమేత అరుణాచలేశ్వర స్వామి దర్శనానికి వచ్చారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం, రాత్రి సుమారు 11 గంటల సమయంలో కుటుంబంతో కలిసి గిరిప్రదక్షిణకు బయలుదేరారు.
ఈ ప్రదక్షిణ మార్గంలో ఉన్న అత్యంత ప్రాచుర్యం పొందిన మోక్ష మార్గం ఆలయానికి చేరుకున్నారు. అక్కడ తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని నిర్వహించేందుకు మణికుమార్ సిద్ధమయ్యారు. గుహ ఆకారంలో ఉండే ఈ చిన్న ఆలయంలో భక్తులు వెనుక ద్వారం గుండా పడుకుని లోపలికి ప్రవేశించి, ఇరుకైన మార్గంలో పాకుతూ ముందు ద్వారం ద్వారా బయటకు రావడం ఆనవాయితీ. బయటకు వచ్చాక అక్కడే ఉన్న నందిని, ఇడుక్కు పిల్లయ్యార్‌ను దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని, రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం.
ఈ క్రమంలోనే మణికుమార్ కూడా గుహలోకి ప్రవేశించారు. అయితే, ఆయన శరీర ఆకృతి కొద్దిగా లావుగా ఉండటంతో ఇరుకైన ఆ గుహ మార్గంలో మధ్యలోనే ఇరుక్కుపోయారు. ఎంత ప్రయత్నించినా ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేక తీవ్ర అవస్థలు పడ్డారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు, ఇతర భక్తులు ఆయనను సురక్షితంగా బయటకు తీసేందుకు ఎంతగానో శ్రమించారు.కానీ, ఊపిరాడటానికి గాలి సరిపోక, ఆందోళన పెరిగిపోవడంతో మణికుమార్ స్పృహ తప్పి అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు.
అనంతరం ఇతర భక్తులు ఎంతో కష్టపడి ఆయనను గుహ నుంచి బయటకు తీసి, వెంటనే 108 అంబులెన్స్ ద్వారా తిరువణ్ణామలై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, మార్గమధ్యలోనే మణికుమార్ పరిస్థితి విషమించడంతో, ఆసుపత్రికి చేరుకునేసరికి ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కళ్లముందే తమ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
సమాచారం అందుకున్న తిరువణ్ణామలై తాలూకా పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి, మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబీకులకు అప్పగించనున్నారు.




