రైలు ఆలస్యంతో విమానం మిస్.. దంపతులకు రైల్వే రూ.63 వేల పరిహారం!

Indian Railways: జమ్మూ నుంచి ఢిల్లీకి రైలులో వెళ్లి, అక్కడి నుంచి విమానంలో గువహతి చేరుకోవాలనుకున్న ఓ జంటకు ఊహించని ఇబ్బంది ఎదురైంది.

G Krishna
Published on: 25 Nov 2026 12:00 PM IST
Indian Railways
X

రైలు ఆలస్యంతో విమానం మిస్.. దంపతులకు రైల్వే రూ.63 వేల పరిహారం!

Indian Railways: జమ్మూ నుంచి ఢిల్లీకి రైలులో వెళ్లి, అక్కడి నుంచి విమానంలో గువహతి చేరుకోవాలనుకున్న ఓ జంటకు ఊహించని ఇబ్బంది ఎదురైంది. రైలు దాదాపు నాలుగు గంటలు ఆలస్యంగా నడవడంతో కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ కావడమే కాకుండా, అదనపు ఖర్చులు, హోటల్ బస వంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఈ వ్యవహారంలో ఉత్తర రైల్వేల సేవా లోపాన్ని గుర్తించిన జమ్మూ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్, బాధిత దంపతులకు రూ.63,199 పరిహారం చెల్లించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

అసలేం జరిగింది.. నాలుగు గంటలు ఆలస్యమైన రైలు

ఫిర్యాదు వివరాల ప్రకారం, మోహిత్ సింగ్ భావు, అతని భార్య దామిని బిల్లోరియా 2022 డిసెంబర్ 19న జమ్మూ నుంచి ఢిల్లీ దురంతో ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. మరుసటి రోజు తెల్లవారుజామున 3:55 గంటలకు ఈ రైలు ఢిల్లీ చేరుకోవాల్సి ఉంది. కానీ దాదాపు నాలుగు గంటలు ఆలస్యంగా ఉదయం 7:50 గంటలకు ఢిల్లీకి చేరుకుంది. అప్పటికే గువహతి వెళ్లాల్సిన వారి విమానం ఉదయం 7:15 గంటలకు బయలుదేరి వెళ్లిపోయింది.

అదనపు ఖర్చులు.. బాధితుల ఫిర్యాదు

రైలు ఆలస్యం వల్ల విమానం మిస్ కావడంతో, కొత్తగా విమాన టికెట్ల కోసం రూ.35,699, ఢిల్లీలో హోటల్ బస కోసం రూ.2,500 కలిపి మొత్తం రూ.38,199 ఖర్చు చేయాల్సి వచ్చిందని దంపతులు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆర్థిక నష్టానికి రూ.60,000, మానసిక వేదన, అసౌకర్యానికి రూ.50,000, వ్యాజ్య ఖర్చుల కింద రూ.30,000 చెల్లించాలని వారు కోరారు.

రైల్వేల వాదన.. కమిషన్ పరిశీలన

మంచు కారణంగానే రైలు ఆలస్యమైందని ఉత్తర రైల్వే వాదించింది. బాధ్యత నుంచి తప్పించుకునేందుకు ఇండియన్ రైల్వే కాన్ఫరెన్స్ అసోసియేషన్ కోచింగ్ టారిఫ్‌లోని రూల్ 115ను ప్రస్తావించింది.

అయితే రైల్వే అధికారులు సకాలంలో లిఖితపూర్వక సమాధానం దాఖలు చేయలేదని, ఆలస్యం తమ నియంత్రణలో లేదని నిరూపించే ఆధారాలు కూడా సమర్పించలేదని కమిషన్ అధ్యక్షుడు పవన్ దేవ్ కొత్వాల్, సభ్యురాలు నీలం బాలా భరద్వాజ్ గమనించారు. సరైన ఆధారాలు లేకుండా కేవలం మంచు పేరు చెప్పడం సరికాదని తేల్చిచెప్పారు.

పరిహారం ఆదేశం.. ఆరు వారాల్లో గడువు

రైల్వేల నిర్లక్ష్యం, సేవా లోపాన్ని నిర్ధారించిన కమిషన్, కొత్త విమాన టికెట్లు, హోటల్ కోసం ఖర్చు చేసిన రూ.38,199ను వార్షికంగా 7.5 శాతం వడ్డీతో కలిపి తిరిగి చెల్లించాలని ఆదేశించింది. మానసిక వేదన, అసౌకర్యానికి రూ.20,000, న్యాయ ఖర్చుల కింద రూ.5,000 కలిపి మొత్తం రూ.63,199 పరిహారం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులు అందిన ఆరు వారాల్లోపు మొత్తాన్ని చెల్లించాలని కమిషన్ ఆదేశించింది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.