Tripura Border Clash: జవాన్ల ఆయుధం లాక్కున్న కేసులో 18 మంది అరెస్ట్..!

Tripura Border Clash: అషాబరి బిఓపి వద్ద బిఎస్ఎఫ్ జవాన్లపై దాడి, ఆయుధం లాక్కున్న కేసులో 18 మంది అరెస్ట్.

Gagan kumar
Published on: 7 Nov 2026 7:51 PM IST
Tripura Border Clash
X

Tripura Border Clash: జవాన్ల ఆయుధం లాక్కున్న కేసులో 18 మంది అరెస్ట్..!

Tripura BSF jawans: త్రిపుర సరిహద్దు ప్రాంతంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లపై జరిగిన దారుణ దాడి ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు నిరసనగా, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా భద్రతా దళాలు విరుచుకుపడ్డాయి. త్రిపుర పోలీసులు, BSF, కస్టమ్స్ అధికారులు, సోనామురా సబ్-డివిజనల్ పరిపాలనా యంత్రాంగం సంయుక్తంగా రంగంలోకి దిగి చేపట్టిన భారీ దాడులు, అరెస్టులతో సరిహద్దు ప్రాంతాలు అట్టుడుకుతున్నాయి.

అషాబరి బోర్డర్ అబ్జర్వేషన్ పోస్ట్ వద్ద BSF సిబ్బందిపై జరిగిన దాడికి ప్రతిస్పందనగా, అధికారులు రహీంపూర్ మార్కెట్‌లో సంచలన సంయుక్త సోదాలు నిర్వహించారు. ఈ సోదాల సమయంలో చట్టవ్యతిరేకంగా నిల్వ ఉంచిన భారీ మొత్తంలో బాణసంచా, బిస్కెట్ లారీ లోడ్లు, అనేక రకాల వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోదాల ప్రక్రియలో భాగంగా దాదాపు ఎనిమిది దుకాణాల తాళాలు, షట్టర్లు పగిలిపోయాయి.

ఈ అకస్మాత్తు చర్యలతో రహీంపూర్ మార్కెట్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత, భయాందోళనలు నెలకొన్నాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ సంయుక్త దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. స్వాధినం చేసుకున్న వస్తువుల పూర్తి వివరాలు, ఈ భారీ ఆపరేషన్ ఫలితాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

మరోవైపు అషాబరి దాడి కేసు విచారణలో పోలీసులు వేగం పెంచారు. బాక్సానగర్ వద్ద సరిహద్దు విధుల్లో ఉన్న BSF సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించి, వారిపై తీవ్రంగా దాడి చేయడమే కాకుండా.. BSF జవాను సర్వీస్ ఆయుధాన్ని లాక్కున్న అత్యంత తీవ్రమైన నేరానికి సంబంధించి న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. కలంచౌరా పోలీస్ స్టేషన్ పోలీసులు బుధవారం రాత్రి మరో ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. గురువారం నాడు వీరిని సెపాహిజాల జిల్లా , సెషన్స్ కోర్టులో హాజరుపరచగా, కోర్టు వారికి 8 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ తాజా అరెస్టులతో ఈ కేసులో అరెస్టయిన వారి మొత్తం సంఖ్య 18కి చేరింది.

ఇంతకుముందు నవంబర్ 3న, ఈ దాడి ఘటనకు సంబంధించి ఏడుగురు పురుషులు, ముగ్గురు మహిళలతో సహా మొత్తం 10 మందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుపై ప్రభుత్వ ప్రాసిక్యూటర్ గౌతమ్ గిరి మాట్లాడుతూ.. నిందితుల పూర్తి సమాచారం రాబట్టేందుకు, నేరం వెనుక ఉన్న కుట్రను తేల్చేందుకు పోలీసుల కస్టడీ అభ్యర్థనను కోర్టు మంజూరు చేసిందని తెలిపారు. సమగ్ర విచారణ ద్వారా ఘటన ఎలా జరిగిందో స్పష్టమవుతుందని, దోషులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఈ దాడులు, అరెస్టులపై త్రిపుర పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఇప్పర్ మంచక్ వార్తా సంస్థ ఏఎన్‌ఐతో మాట్లాడారు. ఈ నెల 2న, కొంతమంది స్థానికులు అషాబరి BOP వద్ద విధులు నిర్వహిస్తున్న BSF సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించి, వారిపై భౌతిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకుని వెంటనే చర్యలు చేపట్టాం. తొలిరోజే ముగ్గురు మహిళలు, ఏడుగురు పురుషులు సహా 10 మందిని అరెస్టు చేశాం. నిన్న మరో ఎనిమిది మందిని అరెస్టు చేయడంతో సంఖ్య 18కి చేరింది. ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న వారితో పాటు, వారికి వెనుక నుండి సహకరించిన వారి పాత్రపై కూడా విచారణ జరుపుతున్నాం. పక్కా ఆధారాల ఆధారంగానే అరెస్టులు సాగుతున్నాయి.

విధులు నిర్వహిస్తున్న సైనిక సిబ్బందిపై దాడులకు తెగబడడం, ఆయుధాలు లాక్కోవడం వంటి చర్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నాయి. దాడికి పాల్పడిన నిందితుల కోసం సరిహద్దు గ్రామాల్లో ప్రత్యేక గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇకపై ఇలాంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.