TVK: తమిళనాట ముగిసిన పొలిటికల్ సస్పెన్స్.. రేపు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం
TVK: తమిళనాడులో విజయ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతించారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే మద్దతుతో మే 9న విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
TVK: తమిళనాట ముగిసిన పొలిటికల్ సస్పెన్స్.. రేపు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం
TVK: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం నెలకొన్న రాజకీయ అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడింది. తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శనివారం (మే 9న) ఉదయం 11 గంటలకు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో 107 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకు, మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడానికి ఇతర పార్టీల మద్దతు అవసరమైంది. ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు తెలపగా, తాజాగా సీపీఐ, సీపీఎం మరియు వీసీకే (VCK) పార్టీలు కూడా తమ మద్దతును ప్రకటించాయి. పార్టీల వారీగా సంఖ్యాబలాలు పరిశీలిస్తే.. టీవీకే : 107; కాంగ్రెస్ : 5; సీపీఐ : 2; సీపీఎం : 2; వీసీకే : 2. దీంతో మెజార్టీకి కావలసిన స్పష్టమైన సంఖ్యాబలం విజయ్ సొంతమైంది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం లోక్ భవన్‌లో గవర్నర్‌ను కలిసిన విజయ్, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు.
విజయ్ ప్రభుత్వానికి తాము బయట నుంచే మద్దతు ఇస్తామని, మంత్రివర్గంలో చేరబోమని సీపీఎం నేత యు. వాసుకి స్పష్టం చేశారు. ప్రజా సమస్యల ఆధారంగానే స్వతంత్రంగా వ్యవహరిస్తామని, అసెంబ్లీలో బలపరీక్ష సమయంలో టీవీకేకు అనుకూలంగా ఓటు వేస్తామని తెలిపారు. లౌకికవాదం, రాష్ట్రాల హక్కులు, ప్రజల ఐక్యత కోసం కట్టుబడి ఉండే ఏ పార్టీతోనైనా కలిసి నడుస్తామని ఆమె పేర్కొన్నారు. వీసీకే కూడా ఇదే బాటలో నడిచే అవకాశం ఉంది.
మద్దతు ప్రకటించిన వెంటనే విజయ్ నేరుగా చెన్నైలోని సీపీఐ, సీపీఎం కార్యాలయాలకు వెళ్లారు. సంక్షోభ సమయంలో తనకు అండగా నిలిచిన కమ్యూనిస్టు పార్టీల నేతలకు వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలియజేశారు. శనివారం జరగనున్న ఈ చారిత్రాత్మక ప్రమాణస్వీకార వేడుకకు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సుదీర్ఘ కాలం తర్వాత తమిళనాడులో ఒక నూతన ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వస్తుండటంతో దేశవ్యాప్తంగా ఈ పరిణామం ఆసక్తిని రేకెత్తిస్తోంది.




