TVK Vijay : టీవీకే ప్రభుత్వ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్

తమిళనాడులోని విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. గతేడాది కరూర్ త్రొక్కిసలాట ఘటనలో మరణించిన వారి

G Krishna
Published on: 27 July 2026 6:30 PM IST
TVK Vijay
X

TVK Vijay

తమిళనాడులోని విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. గతేడాది కరూర్ త్రొక్కిసలాట ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ హైకోర్టు సోమవారం సంచలన తీర్పునిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇలాంటి కేటాయింపులు రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 14 (సమానత్వపు హక్కు), ఆర్టికల్ 16 (ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు) సూత్రాలను ఉల్లంఘించడమేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఇలాంటి నిర్ణయాలు భవిష్యత్తులో మిగతా వారు కూడా ఇదే తరహా ఉద్యోగాలను డిమాండ్ చేయడానికి దారితీస్తాయని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

కరూర్ ఘటన నేపథ్యం.. వివాదాలు

గత ఏడాది సెప్టెంబర్‌లో నాటి డీఎంకే పాలనలో టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన సభలో ఘోర త్రొక్కిసలాట జరిగింది. ఈ దురదృష్టకర ఘటనలో చిన్నారులతో సహా ఏకంగా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. విజయ్ ఆలస్యంగా రావడం వల్లే మైదానంలో జనాలు పరిమితికి మించి గుమిగూడారని, తాగునీరు, ఆహారం, శౌచాలయాల సదుపాయాల్లో తీవ్ర లోపాలు ఉన్నాయని అప్పట్లో పోలీసులు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను టీవీకే ఖండించింది. పోలీసుల వైఫల్యం, మాజీ డీఎంకే మంత్రి సెంథిల్ బాలాజీ కుట్ర వల్లే ఇది జరిగిందని ఆరోపించగా, ఆయన కూడా ఆ వ్యాఖ్యలను తోసిపుచ్చారు.

ఈ కేసు తీవ్రతను పరిశీలించిన సుప్రీంకోర్టు, అక్టోబర్ 2025లో దర్యాప్తును రాష్ట్ర సిట్ (SIT) నుంచి సీబీఐ (CBI)కి బదిలీ చేసింది. స్వతంత్ర , నిష్పాక్షిక విచారణ అవసరమని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో, ప్రస్తుతం సీబీఐ అధికారులు జనసమీకరణ ఏర్పాట్లు, విజయ్ రాక కాలక్రమం , స్థానిక అధికారులతో నిర్వాహకుల సమన్వయంపై లోతుగా విచారణ జరుపుతున్నారు.

ప్రభుత్వ నిర్ణయం – ఏఐఏడీఎంకే ఘాటు విమర్శలు

కరూర్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 32 మంది బాధితుల కుటుంబ సభ్యులకు ఆదుకునే చర్యల్లో భాగంగా ఇటీవలే ముఖ్యమంత్రి విజయ్ కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. బాధితుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే తమ ఉద్దేశమని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ నిర్ణయంపై ఏఐఏడీఎంకే (AIADMK) తీవ్రంగా మండిపడింది.

సీనియర్ ఏఐఏడీఎంకే నాయకుడు ఆర్‌బీ ఉదయకుమార్ ఈ చర్యను "నమ్మకద్రోహం" అని అభివర్ణించారు. ఏళ్ల తరబడి కష్టపడి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే లక్షలాది మంది సామాన్య యువత భవిష్యత్తును దెబ్బతీసేలా ఈ నియామకాలు ఉన్నాయని విమర్శించారు. తమిళనాడులో అన్ని ప్రభుత్వ నియామకాలు కేవలం టీఎన్‌పీఎస్సీ (TNPSC) నిబంధనల ప్రకారమే జరగాలని, రాజకీయ ప్రయోజనాల కోసం చట్టబద్ధమైన ప్రక్రియలను పక్కనపెట్టి ఉద్యోగాలు ఇవ్వడం అత్యంత తప్పుడవు నిర్ణయమని ఆయన ధ్వజమెత్తారు.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం యువతకు తప్పుడు సందేశాన్ని ఇస్తుందన్న ఏఐఏడీఎంకే ఆరోపణలు, రాజ్యాంగ విరుద్ధమన్న మద్రాస్ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలతో టీవీకే ప్రభుత్వం తీవ్ర డిఫెన్స్‌లో పడింది. బాధితులను ఆదుకోవాలన్న ప్రభుత్వ ఉద్దేశం ఎలా ఉన్నా, చట్టపరమైన నిబంధనలను పాటించకపోవడం వల్ల ఈ చిక్కులు ఎదురయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story