MLA Arul Vignesh: మహిళా ఐఏఎస్ అధికారిపై వేధింపులు..విజయ్ పార్టీ ఎమ్మెల్యే అరెస్ట్..!
MLA Arul Vignesh: మహిళా ఐఏఎస్ అధికారిపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో తమిళనాడు టీవీకే ఎమ్మెల్యే సి. అరుల్ విఘ్నేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
MLA Arul Vignesh: మహిళా ఐఏఎస్ అధికారిపై వేధింపులు..విజయ్ పార్టీ ఎమ్మెల్యే అరెస్ట్..!
MLA Arul Vignesh: తమిళనాడు రాజకీయాల్లో పెను దుమారం రేపిన మహిళా ఐఏఎస్ అధికారి వేధింపుల కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో అధికార తమిళగ వెట్రి కళగం పార్టీకి చెందిన ఎమ్మెల్యే సి. అరుల్ విఘ్నేష్‌ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో చర్యలు తీసుకోవడానికి విజయ్ ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తోందని మద్రాస్ హైకోర్టు తీవ్రంగా ప్రశ్నించిన మూడు రోజుల తర్వాత పోలీసులు ఈ చర్య చేపట్టడం గమనార్హం.
బాధిత మహిళా ఐఏఎస్ అధికారి పోలీసులకు ఇచ్చిన అధికారిక ఫిర్యాదు ప్రకారం.. ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్ తనకు అసభ్యకరమైన వాట్సాప్ మెసేజ్‌లు పంపడమే కాకుండా, మద్యం మత్తులో తన అధికారిక నివాసానికి వచ్చి వేధించారని ఆరోపించారు. జులై 31నే ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పటికీ, అప్పట్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదని కోర్టుకు సమర్పించిన వివరాల ద్వారా తెలుస్తోంది. చివరకు నవంబర్ 23న బాధిత అధికారి ధైర్యంగా ముందుకు వచ్చి అధికారికంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మద్రాస్ హైకోర్టు , జాతీయ మహిళా కమిషన్ జోక్యం చేసుకోవడంతో దర్యాప్తు వేగవంతమై శుక్రవారం ఎమ్మెల్యే అరెస్టుకు దారితీసింది.
మరోవైపు, తనపై వచ్చిన ఆరోపణలను ఎమ్మెల్యే సి. అరుల్ విఘ్నేష్ ఖండించారు. ఇదంతా రాజకీయ ప్రేరేపిత కుట్ర అని ఆయన పేర్కొన్నారు. ఒక ఉన్నత స్థాయి ఐఏఎస్ అధికారి అధికారిక నివాసం వద్ద కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాలు ఉంటాయని, అలాంటప్పుడు తాను మద్యం మత్తులో లోపలికి ఎలా వెళ్లగలనని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనపై ప్రతిపక్ష డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. నిందితుడైన ఎమ్మెల్యేను కాపాడేందుకు మంత్రులు ప్రయత్నించారని, 116 రోజుల పాటు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆయన ఆరోపించారు.
ఈ వ్యవహారంలో బాధిత మహిళా అధికారిని రాజీకి ఒత్తిడి చేశారని స్టాలిన్ విమర్శించారు. అయినప్పటికీ ఆమె వెనక్కి తగ్గకుండా ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేశారని ప్రశంసించారు. మద్రాస్ హైకోర్టు, జాతీయ మహిళా కమిషన్ జోక్యం వల్లే ఈ అరెస్ట్ సాధ్యమైందని స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఉన్నత స్థాయి అధికారికే ఇలాంటి పరిస్థితి ఎదురవడం, అది కూడా నెలల తరబడి చర్యలు తీసుకోవడంలో జాప్యం జరగడం తమిళనాడు అధికార వర్గాల్లో ,రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.




