Udhayanidhi Stalin : త్రిషపై డబుల్ మీనింగ్ కామెంట్.. ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్.!

Udhayanidhi Stalin : తమిళనాడు రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం చెలరేగింది. ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన ఒక వివాదాస్పద వ్యాఖ్య తీవ్ర విమర్శలకు

G Krishna
Updated on: 4 Aug 2026 12:31 PM IST
Udhayanidhi Stalin arrest
X

Udhayanidhi Stalin arrest

Udhayanidhi Stalin : తమిళనాడు రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం చెలరేగింది. ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన ఒక వివాదాస్పద వ్యాఖ్య తీవ్ర విమర్శలకు దారితీయగా, ఆ వ్యాఖ్యలపై కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిషను ఉద్దేశించి పరోక్షంగా లైంగిక ద్వంద్వార్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

అసలు వివాదం ఏంటి?

కావేరీ జలాల వివాదంపై జరిగిన ఓ సభలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వాన్ని ఉదయనిధి స్టాలిన్ విమర్శిస్తున్నారు. ఈ సమయంలో సభలో ఉన్న కొందరు "త్రిష.. త్రిష.." అంటూ నినాదాలు చేయగా, దానికి ఉదయనిధి స్పందించిన తీరు ద్వంద్వార్థంగా ఉందని విమర్శలు వచ్చాయి. ఆ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించినవేనని రాజకీయ ప్రత్యర్థులు ఆరోపించారు.

కేసు నమోదు.. పోలీసుల అదుపులోకి ఉదయనిధి

వివాదాస్పద వ్యాఖ్యలపై ఫిర్యాదులు అందడంతో తమిళనాడు పోలీసులు ఉదయనిధిపై కేసు నమోదు చేశారు. అనంతరం చెన్నైలోని ఆయన నివాసానికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు వాహనంలో తీసుకెళ్తుండగా ఉదయనిధి మాట్లాడుతూ.. "ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య. నిజానిజాలు కోర్టే తేలుస్తుంది" అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో అరెస్టు నుంచి రక్షణ కోరుతూ ఆయన మద్రాస్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు.

ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు

ఉదయనిధి వ్యాఖ్యలను తమిళనాడులోని పలు రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. టీవీకే (TVK) నేత ఆధవ్ అర్జునా ఉదయనిధిని "అశ్లీల నిధి" అంటూ విమర్శిస్తూ, మహిళలను అవమానించేలా మాట్లాడారని ఆరోపించారు. టీవీకే అధికార ప్రతినిధి ఫెలిక్స్ జెరాల్డ్ కూడా, "ఇలాంటి మాటలను తన పిల్లల ముందూ మాట్లాడగలరా?" అంటూ ప్రశ్నించారు.

తమిళనాడు బీజేపీ నేతలు కూడా ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి ఉదయనిధిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కే. అన్నామలై విమర్శలు గుప్పించగా, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ నటి త్రిషకు ఉదయనిధి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

డీఎంకే కౌంటర్.. "కావేరీ అంశం నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం"

ఉదయనిధికి డీఎంకే అండగా నిలిచింది. మాజీ మంత్రి టి. మనో తంగరాజ్ మాట్లాడుతూ.. ఇది కావేరీ జలాల సమస్య నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రతిపక్షాలు సృష్టించిన రాజకీయ వివాదమని ఆరోపించారు. అసలు చర్చ కావాల్సింది రైతుల సమస్యలపైనేనని, కావాలని ఈ అంశాన్ని పెద్దది చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే.. పోలీసుల చర్య, ఉదయనిధి అరెస్ట్, ముందస్తు బెయిల్ పిటిషన్ నేపథ్యంలో ఈ వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో మద్రాస్ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story