Train Accident : పట్టాలు తప్పిన ఉజ్జయిని ఎక్స్‌ప్రెస్.. స్తంభాన్ని ఢీకొట్టిన బోగీ..తృటిలో తప్పిన పెను ప్రమాదం
Train Accident : రిషికేశ్‌లోని యోగనగరి స్టేషన్ వద్ద ఉజ్జయిని ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. షంటింగ్ సమయంలో రైలు విద్యుత్ స్థంభాన్ని బలంగా ఢీకొట్టింది.
Train Accident
Train Accident : ఉత్తరాఖండ్‌లోని ఆధ్యాత్మిక నగరం రిషికేశ్‌లో పెను రైలు ప్రమాదం తృటిలో తప్పింది. సోమవారం అర్థరాత్రి యోగనగరి రైల్వే స్టేషన్ సమీపంలో ఉజ్జయిని ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రైలు ఇంజిన్, మరికొన్ని బోగీలు ఒక్కసారిగా ట్రాక్ పక్కకు దూసుకుపోయాయి. అయితే ఆ సమయంలో రైలులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రాణనష్టం తప్పింది. లేదంటే పరిస్థితి ఊహకందని విధంగా ఉండేదని అధికారులు చెబుతున్నారు.
స్తంభాన్ని ఢీకొట్టిన బోగీ.. ఏం జరిగిందంటే?
మంగళవారం ఉదయం ప్రయాణానికి సిద్ధం చేసేందుకు లోకో పైలట్ సోమవారం రాత్రి ఈ రైలును షంటింగ్ చేస్తున్నారు. యార్డ్ వైపు రైలును మళ్లించే సమయంలో ఖండ్ గ్రామం దగ్గర ఒక్కసారిగా అదుపు తప్పిన ఇంజిన్ పట్టాలు విడిచి పక్కకు వెళ్ళింది. అదే ఊపులో వెనుక ఉన్న ఒక బోగీ రైల్వే ఎలక్ట్రిక్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఆ ధాటికి స్తంభం తునాతునకలైపోయింది. పెద్ద శబ్దం రావడంతో గ్రామస్తులు ఏం జరుగుతుందో తెలియక భయంతో పరుగులు తీశారు. రైలు ఖాళీగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
విచారణకు ఆదేశించిన అధికారులు
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఆర్పీఎఫ్ (RPF), జీఆర్పీ (GRP) బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. రైల్వే ఉన్నతాధికారులు కూడా అర్ధరాత్రి అక్కడికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. బ్రేక్ సిస్టమ్‌లో సాంకేతిక లోపం వల్ల ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అయితే, లోకో పైలట్ నిర్లక్ష్యం ఏమైనా ఉందా అనే కోణంలో జీఆర్పీ ఎస్పీ అరుణా భారతి విచారణకు ఆదేశించారు. రాత్రంతా కష్టపడి పట్టాలు తప్పిన బోగీలను మెయిన్ రైలు నుంచి వేరు చేశారు.
రైళ్ల రాకపోకలు యథావిధిగా..
ఈ ప్రమాదం మెయిన్ ట్రాక్ మీద కాకుండా యార్డ్ వైపు వెళ్లే లైన్ మీద జరగడంతో ఇతర రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. రిషికేశ్ వచ్చే ఇతర రైళ్లన్నీ టైమ్ ప్రకారమే నడుస్తున్నాయని రైల్వే మేనేజర్ మహేష్ యాదవ్ తెలిపారు. అయితే, నిత్యం వేలాది మంది భక్తులు వచ్చే రిషికేశ్ లాంటి రద్దీ ప్రాంతంలో ఇలాంటి సాంకేతిక లోపాలు తలెత్తడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైల్వే భద్రతపై విచారణ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు.




