Jitendra Singh: పేపర్ లీకేజీ గ్యాంగ్‌లకు పదేళ్ల జైలు, రూ.10 కోట్ల జరిమానా: జితేంద్రసింగ్!

Jitendra Singh: పార్లమెంట్‌లో యాంటీ పేపర్‌ లీక్ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి జితేంద్రసింగ్.

Arun Chilukuri
Published on: 28 July 2026 3:08 PM IST
Jitendra Singh
X

Jitendra Singh: పేపర్ లీకేజీ గ్యాంగ్‌లకు పదేళ్ల జైలు, రూ.10 కోట్ల జరిమానా: జితేంద్రసింగ్!

Jitendra Singh: దేశంలోని విద్యార్థులు, యువత భవిష్యత్తు పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ‘పేపర్‌ లీక్‌ నిరోధక సవరణ బిల్లు (Anti Paper Leak Amendment Bill)’ ప్రత్యక్ష నిదర్శనమని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదుల శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ స్పష్టం చేశారు. పార్లమెంటులో ఈ సవరణ బిల్లుపై చర్చను ప్రారంభించిన ఆయన.. ఈ నూతన చట్టం భారత పార్లమెంటు చరిత్రలోనే నిలిచిపోతుందని పేర్కొన్నారు.

పేపర్ లీకేజీలు క్రమంగా వ్యవస్థాగత నేరాలుగా మారాయని, వీటిని అరికట్టేందుకే చట్టంలో సమగ్ర మార్పులు తీసుకొచ్చామని సభకు వివరించారు. కాంగ్రెస్‌ పాలనలోనూ 2009, 2011, 2012 సంవత్సరాల్లో ఎయిమ్స్ (AIIMS) ప్రవేశ పరీక్షలతో పాటు తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లలో పలు పరీక్షల పేపర్లు లీకయ్యాయని గుర్తుచేశారు. గతంలో వీటిని నియంత్రించేందుకు జరిగిన ప్రయత్నాలు ఎందుకు పూర్తి కాలేదో నాటి పాలకులే చెప్పాలని నిలదీశారు.

ఇటీవల నీట్ (NEET) పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ అంశం వెలుగులోకి రాగానే కేంద్ర ప్రభుత్వం వేగంగా స్పందించి విచారణను, చర్యలను ప్రారంభించిందని తెలిపారు. పేపర్ లీకేజీ గ్యాంగ్‌లను, నిందితులను కఠినంగా శిక్షించేందుకు బిల్లులో కీలక నిబంధనలు రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు. దోషులకు విధించే జైలు శిక్షకాలాన్ని గరిష్టంగా 10 ఏళ్లకు పెంచారు. లీకేజీ మాఫియా, ముఠాలకు విధించే జరిమానాను రూ. కోటి నుంచి రూ. 10 కోట్లకు పెంచడం జరిగింది. కేసుల విచారణను వేగవంతం చేసి నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story