Fuel Prices: క్రూడాయిల్ ధరలు తగ్గినా.. భారత్‌లో పెట్రోల్ రేట్లు ఇప్పుడే తగ్గవు: కేంద్రం వెల్లడి!

Fuel Prices: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినా.. భారత్‌లో ఇంధన ధరలను వెంటనే తగ్గించలేమని కేంద్ర మంత్రి సురేశ్‌ గోపీ స్పష్టం చేశారు.

Arun Chilukuri
Published on: 18 Jun 2026 11:37 AM IST
Fuel Prices
X

Fuel Prices: క్రూడాయిల్ ధరలు తగ్గినా.. భారత్‌లో పెట్రోల్ రేట్లు ఇప్పుడే తగ్గవు: కేంద్రం వెల్లడి!

Fuel Prices: అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందంతో పశ్చిమాసియా సంక్షోభానికి తెరపడింది. ఈ సానుకూల పరిణామంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు (Crude Oil) ధరలు భారీగా దిగివస్తున్నాయి. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో రేట్లు తగ్గినప్పటికీ.. భారత్‌లో మాత్రం వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఇంధన ధరల సవరణ అంశంపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ సహాయ మంత్రి సురేశ్‌ గోపీ గురువారం కీలక విషయాలను వెల్లడించారు.

ఇటీవల దేశీయంగా ఇంధన ధరలను లీటరుకు దాదాపు రూ.3.94 మాత్రమే పెంచామని గుర్తుచేసిన మంత్రి.. ప్రపంచ మార్కెట్లో క్రూడాయిల్ రేటు తగ్గిన వెంటనే ఇక్కడ కూడా ధరలను తగ్గించడం సాధ్యం కాదన్నారు. దానికి గల కారణాలను ఆయన వివరించారు.

అమెరికా-ఇరాన్ ఒప్పందం తర్వాత హర్మూజ్ జలసంధి తెరుచుకున్నప్పటికీ.. ప్రస్తుతం అక్కడ నౌకల రాకపోకల రద్దీ (Excessive Traffic) విపరీతంగా పెరిగింది. రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల తక్కువ ధరకు లభించే ముడి చమురు నిల్వలు మన దేశానికి చేరుకోవడానికి ఇంకాస్త సమయం పడుతుంది. రవాణా మార్గాలు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే వరకు అంతర్జాతీయ ధరల తగ్గుదల ప్రభావం దేశీయంగా ఇప్పుడే కనిపించదని ఆయన స్పష్టం చేశారు.

పశ్చిమాసియాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి దేశంలోని ప్రభుత్వ చమురు కంపెనీలు తీవ్రంగా నష్టపోయాయని సురేశ్ గోపీ తెలిపారు. సంక్షోభ సమయాల్లో కేంద్రం తీసుకున్న భారాల గురించి ఆయన ప్రస్తావించారు.

అంతర్జాతీయంగా రేట్లు పెరిగినప్పుడు వినియోగదారులపై భారం పడకుండా కేంద్ర ప్రభుత్వమే ఆ ప్రభావాన్ని చాలా వరకు తనపై వేసుకుంది. ధరలు పెరిగిన ఆ కష్టకాలంలో ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని (రాబడిని) తగ్గించేందుకు ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రాలేదు. రాష్ట్రాలు సహకరించకపోవడంతో ఆ భారమంతా కేంద్రంపైనే పడిందని.. దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి ఏకంగా రూ.12,000 కోట్ల మేర నష్టం వాటిల్లిందని మంత్రి వెల్లడించారు.

చమురు కంపెనీలు మనుగడ సాగించాలన్నా, కేంద్రం పటిష్టంగా నడవాలన్నా ఇవన్నీ బేరీజు వేసుకోవాల్సి ఉంటుందని, అందుకే ముడి చమురు నిల్వల సప్లై సజావుగా సాగాకే ధరల తగ్గింపుపై సమీక్ష ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story