Anandiben Patel: ప్రేమ పేరుతో మోసం చేయొద్దు.. యువతకు యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ కీలక సూచనలు!
Anandiben Patel: లక్నో వర్సిటీ స్నాతకోత్సవంలో యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ప్రేమ, పెళ్లి మరియు ఆర్థిక స్వాలంబనపై చేసిన కీలక వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
Anandiben Patel: ప్రేమ పేరుతో మోసం చేయొద్దు.. యువతకు యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ కీలక సూచనలు!
Anandiben Patel: ప్రేమ, పెళ్లి మరియు కుటుంబ బాధ్యతలపై ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ చేసిన వ్యాఖ్యలు మరోసారి జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. లక్నోలోని 'మహర్షి యూనివర్సిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ' 7వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె, నేటి తరం యువతకు సంబంధాలు మరియు జీవిత బాధ్యతలపై కీలక సూచనలు చేశారు.
ఈ వేడుకలో మాట్లాడిన గవర్నర్ ఆనందీబెన్ పటేల్.. యువత గర్ల్‌ఫ్రెండ్‌ను కలిగి ఉండటంలో లేదా ప్రేమించడంలో ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేశారు. అయితే ప్రేమ పేరుతో ఒక అమ్మాయితో బంధం ఏర్పరచుకుని, ఆ తర్వాత ఆమెను మోసం చేసి ఒంటరిగా వదిలేయడం అత్యంత దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. "ఎవరినైనా ప్రేమిస్తే పెళ్లి చేసుకుంటానని ఇచ్చే మాటకు కట్టుబడి ఉండాలి. కానీ 13, 14 ఏళ్ల చిన్న వయసులోనే బాలికలను గర్భవతులను చేసి, ఆ తర్వాత వారిని అనాథలుగా వదిలేయడం ఏమాత్రం తగదు" అని ఆమె హితవు పలికారు.
యువతీ యువకులు ముందుగా తమ చదువుపై, ఉద్యోగంపై దృష్టి సారించి ఆర్థిక స్వాలంబన సాధించాలని గవర్నర్ సూచించారు. కుటుంబ బాధ్యతలను మోసే స్థాయికి చేరుకున్న తర్వాతే వివాహం గురించి ఆలోచించాలని పేర్కొన్నారు. భావోద్వేగాల ప్రవాహంలో హడావుడిగా తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని, భవిష్యత్తు పరిణామాలను ఆలోచించి అడుగులు వేయాలని తెలిపారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలను అరికట్టేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నప్పటికీ, సమాజం కూడా తన సామాజిక బాధ్యతను గుర్తించాలని పిలుపునిచ్చారు.
గవర్నర్ ఆనందీబెన్ పటేల్ గతంలోనూ కుటుంబ వ్యవస్థ, సంబంధాలపై చేసిన వ్యాఖ్యలు వార్తల్లో నిలిచాయి. గతంలో విశ్వవిద్యాలయాల డిగ్రీ ప్రదానోత్సవాల్లో మాట్లాడుతూ.. యువతులు సహజీవనం సంస్కృతికి దూరంగా ఉండాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. అలాగే ఉద్యోగాలు, కెరీర్‌తో పాటు ప్రథమంగా మంచి తల్లిగా మారడం కూడా ప్రాధాన్యతతో కూడుకున్నదని ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు గతంలో విమర్శలకు దారితీశాయి.




