లాయర్ హత్య తర్వాత షాకింగ్ సీన్.. పారిపోతుండగా మొరాయించిన బైక్!
ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో దారుణం జరిగింది. మార్నింగ్ వాక్‌కు వెళ్లిన న్యాయవాది రాజీవ్ సింగ్‌ను దుండగులు కాల్చి చంపారు.
Mirzapur: ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితిపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మీర్జాపూర్ జిల్లాలో ఒక న్యాయవాదిని దుండగులు నడిరోడ్డుపై కాల్చి చంపడం తీవ్ర సంచలనం సృష్టించింది. మార్నింగ్ వాక్‌కు వెళ్లిన సమయంలో పక్కా ప్లాన్‌తో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
న్యాయవాది రాజీవ్ సింగ్ (45) ప్రతిరోజూ లాగే శనివారం ఉదయం మార్నింగ్ వాక్‌కు వెళ్లారు. అప్పటికే బైక్‌పై వచ్చి మాటు వేసిన ఇద్దరు దుండగులు ఆయన కోసం వేచి చూశారు. రాజీవ్ సింగ్ సమీపానికి రాగానే, ఒక నిందితుడు నాటు తుపాకీతో ఆయనపై అతి సమీపం నుంచి కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలైన రాజీవ్ అక్కడికక్కడే కుప్పకూలి మరణించారు.
హత్య చేసిన అనంతరం నిందితులు పారిపోవడానికి ప్రయత్నించగా వారి బైక్ ఒక్కసారిగా మొరాయించింది. అదే సమయంలో చుట్టుపక్కల ఉన్న స్థానికులు వారిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. అయితే, నిందితులు తుపాకీ చూపించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. చివరకు బైక్ స్టార్ట్ కావడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ మొత్తం దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
రాజీవ్ సింగ్‌కు గత కొంతకాలంగా ప్రాణహాని ఉందని, తనపై దాడి జరగవచ్చని ఆయన పోలీసులకు ముందే ఫిర్యాదు చేసినట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. రక్షణ కల్పించాలని ఆయన పోలీసులను కోరినా, ఫలితం లేకపోవడంతోనే ఈ దారుణం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనతో మీర్జాపూర్‌లోని న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు సిద్ధమవుతున్నారు.




