Jail : నీకేం పోయేకాలం రా అయ్యా.. జైలును చూడాలని ఏకంగా భార్యనే..

Jail : ఉత్తరప్రదేశ్‌లోని ఎటావాలో ఒక వింత సంఘటన వెలుగుచూసింది.

Naresh.k
Published on: 4 Jun 2026 12:31 PM IST
Jail
X

Jail : నీకేం పోయేకాలం రా అయ్యా.. జైలును చూడాలని ఏకంగా భార్యనే..

UP man : సాధారణంగా ప్రజలకు రకరకాల హాబీలు ఉంటాయి. కొందరికి పుస్తకాలు చదవడం, మరికొందరికి సరికొత్త ప్రదేశాలు చుట్టేయడం ఇష్టం. కానీ, ఎవరైనా జైలుకు వెళ్లడాన్ని ఒక హాబీగా మార్చుకుంటారా? వినడానికే వింతగా, ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నా.. ఉత్తరప్రదేశ్‌లోని ఎటావాకు చెందిన ఒక యువకుడి ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కేవలం జైలు లోపల ఎలా ఉంటుందో చూడాలనే వింత కోరికతో అతను చేసిన పని చూసి నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువకుడు పోలీసుల ముందే నిలబడి, ఎలాంటి భయం లేకుండా తన పూర్తి కథను వివరించాడు. తన పేరు కోమల్ సింగ్ అని, అహేరిపూర్ ప్రాంతంలో ట్రాక్టర్ నడుపుతుంటానని చెప్పాడు. తనకు సెంట్రల్ జైలును లోపలి నుండి చూడాలనే వింత కోరిక కలిగిందని, జైలుకు వెళ్లడానికి బలమైన కారణం కావాలి కాబట్టి.. ఏకంగా తన భార్య ఛాతీకే పిస్టల్ గురిపెట్టి బెదిరించానని కూల్‌గా చెప్పుకొచ్చాడు.

అంతటితో ఆగకుండా, తానే స్వయంగా నడుచుకుంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, భార్యను బెదిరించడానికి ఉపయోగించిన పిస్టల్‌ను, మందుగుండు సామగ్రిని పోలీసులకు అప్పగించేశాడు. వీడియోలో అతను మాట్లాడుతున్నంత సేపూ అతని ముఖంలో ఎలాంటి భయం కానీ, పశ్చాత్తాపం కానీ కనిపించకపోవడం గమనార్హం. చివర్లో కెమెరా వైపు చూసి నవ్వుతూ, చేతులు ఊపడం చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు.

విశేషం ఏంటంటే, కోమల్ సింగ్ ఇంతకుముందే మూడుసార్లు ఓరాయ్ జైలుకు వెళ్లొచ్చాడట. ఆ జైలుకు వెళ్లడం తనకు చాలా సాధారణం అయిపోయిందని, అందుకే ఈసారి ఎలాగైనా సెంట్రల్ జైలు అనుభూతిని పొందాలనే పట్టుదలతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టానని గర్వంగా చెబుతున్నాడు. మరోవైపు తన భార్య గురించి మాట్లాడుతూ.. నాకు నా భార్య అంటే ఇష్టం, ఆమె నుండి విడిపోవడం ఇష్టం లేదు. మాకు పెళ్లై చాలా కాలమైనా పిల్లలు లేకపోవడం వల్లే ఇంట్లో చిన్నచిన్న గొడవలు జరుగుతుంటాయి. అంతే తప్ప మా మధ్య పెద్ద గొడవలూ లేవు అని పదేపదే అనడం అందరినీ గందరగోళంలో పడేసింది.




Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story