ఇరాన్ వీడండి.. భారతీయులకు కేంద్రం అత్యవసర అడ్వైజరీ..!

Iran-US, Israel Conflict: అమెరికా-ఇరాన్ యుద్ధంలో అనూహ్య మలుపు. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో 2 వారాల కాల్పుల విరమణ ప్రకటించిన ట్రంప్. ఇరాన్‌లోని భారతీయులు వెంటనే దేశం విడవాలని భారత ప్రభుత్వం అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.

Arun Chilukuri
Updated on: 8 April 2026 2:21 PM IST
US-Iran War
X

ఇరాన్ వీడండి.. భారతీయులకు కేంద్రం అత్యవసర అడ్వైజరీ..!

Iran-US, Israel Conflict: పశ్చిమాసియాలో ముదురుతున్న అమెరికా-ఇరాన్ యుద్ధం అనూహ్య మలుపు తిరిగింది. 'ఇరాన్‌కు ఇది కాళరాత్రి' అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చివరకు రెండు వారాల పాటు దాడులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మధ్యవర్తిత్వంతో రాత్రికి రాత్రే ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది.

ట్రంప్ షరతు.. ఇరాన్ అంగీకారం

హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలన్న ప్రధాన డిమాండ్‌తో ట్రంప్ ఈ గడువును పొడిగించారు. దీనిపై స్పందించిన ఇరాన్, తమ డిమాండ్లకు అమెరికా తలొగ్గడం వల్లే కాల్పుల విరమణకు అంగీకరించామని వెల్లడించింది. అయితే, హర్మూజ్ జలసంధిలో రాకపోకలు తమ సాయుధ దళాల పర్యవేక్షణలోనే కొనసాగుతాయని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ రెండు వారాల విరామం యుద్ధం ముగింపునకు దారితీస్తుందా లేదా అనేది వేచి చూడాలి.

భారతీయులకు అత్యవసర సూచన

యుద్ధ వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేని పరిస్థితుల నేపథ్యంలో, ఇరాన్‌లో ఉన్న భారత పౌరుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌లో ఉన్న భారతీయులందరూ తక్షణమే ఆ దేశాన్ని విడిచి రావాలని బుధవారం ఒక సలహా (Advisory) జారీ చేసింది. భారత రాయబార కార్యాలయం 'ఎక్స్' వేదికగా ఈ మేరకు పోస్ట్ చేసింది.

రాయబార కార్యాలయం సూచనలు:

భారత పౌరులు తమకు అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా వీలైనంత త్వరగా ఇరాన్‌ను వీడాలి.

ఎంబసీతో ముందస్తు సంప్రదింపులు లేకుండా ఎలాంటి అంతర్జాతీయ భూ సరిహద్దులను సమీపించవద్దు.

అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించడానికి ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను విడుదల చేశారు.

అత్యవసర సంప్రదింపు నంబర్లు:

+989128109115; +989128109109; +989128109102; +989932179359

మెయిల్ ఐడి: [email protected]

ప్రస్తుతం రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఉన్నప్పటికీ, పరిస్థితులు ఎప్పుడైనా విషమించే అవకాశం ఉన్నందున భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని విదేశీ వ్యవహారాల శాఖ కోరింది.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story