UP Free Bus Scheme: ఉత్తర ప్రదేశ్‌లో ఉచిత బస్సు సర్వీస్.. క్యాబినెట్ కీలక నిర్ణయం!
Uttar Pradesh Free Bus Scheme: ఉత్తరప్రదేశ్‌లో 60 ఏళ్లు దాటిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించే పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
UP Free Bus Scheme: ఉత్తర ప్రదేశ్‌లో ఉచిత బస్సు సర్వీస్.. క్యాబినెట్ కీలక నిర్ణయం!
Uttar Pradesh Free Bus Scheme: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్న నేపథ్యంలో.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. అయితే యూపీలో ఈ పథకం అందరు మహిళలకు కాకుండా 60 ఏళ్లు దాటిన మహిళలకు మాత్రమే వర్తించనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని రాష్ట్ర క్యాబినెట్ మంగళవారం పథకానికి ఆమోదం తెలిపింది.
60 ఏళ్లు దాటిన మహిళలకు ఉచిత ప్రయాణం
‘లోకమాత అహిల్యాబాయ్ మాతృశక్తి యోజన’ పేరుతో ఈ పథకాన్ని అమలు చేయాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది. అర్హత కలిగిన మహిళలు ఉత్తరప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (UPSRTC)కు చెందిన ప్రభుత్వ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ పథకం జీవితాంతం వర్తిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.
యూపీ రవాణా శాఖ మంత్రి దయాశంకర్ సింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని ప్రభుత్వ బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కోటికి పైగా మహిళలకు ప్రయోజనం కలగవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ఏ పత్రాలు చూపించాలి?
ఈ పథకం కింద ఉచిత ప్రయాణం పొందేందుకు అర్హులైన మహిళలు తమ వయసును నిర్ధారించే ప్రభుత్వ గుర్తింపు పత్రాన్ని చూపించాల్సి ఉంటుంది. ఆధార్, ఓటర్ ఐడీతో పాటు వయసును ధృవీకరించే ఇతర అధికారిక గుర్తింపు కార్డులను ఉపయోగించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.
వృద్ధ మహిళలపై ప్రయాణ ఖర్చుల భారం తగ్గించడంతో పాటు వారికి ప్రజా రవాణాను మరింత అందుబాటులోకి తీసుకురావడమే ఈ పథకం లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది. రక్షా బంధన్ సందర్భంగా రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న కానుకగా ఈ పథకాన్ని అభివర్ణించింది.
గంగా ఎక్స్‌ప్రెస్‌వేపైనా కీలక నిర్ణయం
ఇదిలా ఉంటే.. ఉత్తరప్రదేశ్‌లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేను హరిద్వార్ వరకు పొడిగించే ప్రతిపాదనకు కూడా రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ.10,761 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. ఈ విస్తరణ పూర్తయితే బిజ్నూర్ నుంచి హరిద్వార్ మధ్య రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది.




