Vande Mataram: వందే మాతరానికి చట్టబద్ధ రక్షణ.. అవమానిస్తే జైలు శిక్ష
వందే మాతరానికి జాతీయ గీతంతో సమాన చట్టపరమైన రక్షణ కల్పించే బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. అవమానిస్తే శిక్షలు అమలు కానున్నాయి.
Vande Mataram
దేశ జాతీయ గీతమైన వందే మాతరంకు చట్టపరమైన రక్షణ కల్పించే కీలక బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుతో వందే మాతరాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించడం, ఆలాపనను అడ్డుకోవడం లేదా అంతరాయం కలిగించడం వంటి చర్యలు శిక్షార్హ నేరాలుగా పరిగణించబడతాయి. దీంతో జాతీయ గీతం జనగణమనకు ఉన్న చట్టపరమైన రక్షణను వందే మాతరానికీ విస్తరించినట్లైంది.
ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రివెన్షన్ ఆఫ్ ఇన్‌సల్ట్స్ టు నేషనల్ హానర్ (సవరణ) బిల్లు–2026ను లోక్‌సభ గురువారం వాయిస్ ఓటుతో ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం నేరం రుజువైతే గరిష్ఠంగా మూడు సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. రెండోసారి లేదా అంతకంటే ఎక్కువసార్లు నేరం చేస్తే కనీసం ఒక సంవత్సరం జైలు శిక్ష తప్పనిసరి.
చర్చ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మాట్లాడుతూ, వందే మాతరానికి గత ప్రభుత్వాలు తగిన గౌరవం ఇవ్వలేదని విమర్శించారు. దేశ ఐక్యత కోసం వందే మాతరం పూర్తి ఆరు చరణాలు పాడాలని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే ప్రతిపక్ష సభ్యులు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. డీఎంకే ఎంపీ కనిమొళి మాట్లాడుతూ, దేశభక్తిని చట్టం ద్వారా బలవంతంగా రుద్దలేమని, ఈ చర్య లౌకికవాద స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాతలు మొదటి రెండు చరణాలకే పరిమితం చేయడం వెనుక ఉన్న ఆలోచనను ప్రభుత్వం విస్మరిస్తోందని ఆమె విమర్శించారు.
వందే మాతరం చుట్టూ దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదం
బంకిమ్ చంద్ర చట్టోపాధ్యాయ్ 1875లో రచించిన వందే మాతరం కవిత 1882లో ఆనందమఠం నవలలో ప్రచురితమైంది. స్వాతంత్ర్య ఉద్యమంలో ఇది జాతీయ నినాదంగా మారినప్పటికీ, తరువాతి చరణాల్లో హిందూ దేవతల ప్రస్తావన ఉండటంతో కొంతమంది ముస్లిం నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
1937లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ జాతీయ కార్యక్రమాల్లో వందే మాతరం తొలి రెండు చరణాలు మాత్రమే ఆలపించాలని నిర్ణయించింది. అప్పటి నుంచి ఈ అంశం తరచూ రాజకీయ, సామాజిక చర్చలకు కేంద్రబిందువుగా మారుతోంది. ఇప్పుడు తాజా చట్ట సవరణతో ఈ అంశంపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.




