VB-G RAM G: కేంద్రం ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌.. వారికి వేత‌నాలు పెంచుతూ నిర్ణ‌యం

VB-G RAM G: గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను మరింత విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Mokshith
Published on: 1 July 2026 3:26 PM IST
VB-G RAM G
X

VB-G RAM G: కేంద్రం ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌.. వారికి వేత‌నాలు పెంచుతూ నిర్ణ‌యం

VB-G RAM G: గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను మరింత విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్–గ్రామీణ్ (VB-G RAM G Act) పేరుతో కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే.

100 రోజుల నుంచి 125 రోజుల ఉపాధి.. వేతనాల్లో కూడా పెంపు

జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టం కింద గ్రామీణ కార్మికులకు పనిదినాలు పెరగడమే కాకుండా రోజువారీ వేతనాలను కూడా కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. కొత్త చట్టం ప్రకారం గ్రామీణ కార్మికులకు అందించే ఉపాధి రోజులను 100 నుంచి 125 రోజులకు పెంచారు. అలాగే రోజువారీ వేతనాన్ని కనిష్ఠంగా రూ.300గా నిర్ణయించారు. రాష్ట్రాన్ని బట్టి ఈ మొత్తం మారనుంది. గరిష్ఠంగా రూ.409 వరకు వేతనం చెల్లించనున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వెల్లడించింది. ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సిక్కింలోని కొన్ని పంచాయతీల్లో రోజుకు రూ.450 చెల్లించేందుకు కూడా నిర్ణయం తీసుకుంది.

పలు రాష్ట్రాల్లో భారీ పెంపు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

కొత్త వేతనాల అమలుతో అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, బిహార్, ఝార్ఖండ్, అస్సాం, త్రిపుర, సిక్కిం, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో గత ఉపాధి హామీ పథకంతో పోలిస్తే 15 శాతానికి పైగా వేతనాలు పెరిగాయి. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పెంపు మాత్రం 3 శాతం కంటే తక్కువగానే ఉంది. తాజా నోటిఫికేషన్ ప్రకారం తెలంగాణలో రోజువారీ వేతనం రూ.308గా, ఆంధ్రప్రదేశ్‌లో రూ.312గా నిర్ణయించారు. మహారాష్ట్రలో రూ.317, తమిళనాడులో రూ.345, పుదుచ్చేరిలో రూ.347, కర్ణాటకలో రూ.382, కేరళలో రూ.401, గోవాలో రూ.406 చొప్పున కూలీలకు చెల్లించనున్నారు.

21 రాష్ట్రాల్లో కనీస వేతనం రూ.300.. కొత్త విధానంతో మారిన పరిస్థితి

కొత్త చట్టం కింద 21 రాష్ట్రాల్లో కనీస రోజువారీ వేతనాన్ని రూ.300గా నిర్ణయించారు. గుజరాత్, రాజస్థాన్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌తో పాటు పలు ఈశాన్య రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సాధారణ వేతన సవరణ చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త చట్టం అమలును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఇప్పుడు VB-G RAM G Act అమల్లోకి రావడంతో తాజా వేతనాలను ప్రకటించింది. అంతకుముందు చివరిసారిగా గత ఏడాది మార్చి 27న ఉపాధి హామీ కూలీల వేతనాలను కేంద్రం సవరించింది. కొత్త చట్టంతో గ్రామీణ కార్మికులకు ఎక్కువ పనిదినాలు, మెరుగైన వేతనం అందే అవకాశం ఏర్పడింది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story