VD Satheesan: కేరళ ముఖ్యమంత్రిగా వి.డి. సతీశన్ ప్రమాణ స్వీకారం.. 20 మందితో కొత్త మంత్రివర్గం!

VD Satheesan: కేరళ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత వి.డి. సతీశన్ ప్రమాణ స్వీకారం చేశారు. దశాబ్దం కాలం తర్వాత యూడీఎఫ్ (UDF) కూటమి కేరళలో అధికార పగ్గాలు చేపట్టింది.

Arun Chilukuri
Published on: 18 May 2026 11:09 AM IST
VD Satheesan
X

VD Satheesan: కేరళ ముఖ్యమంత్రిగా వి.డి. సతీశన్ ప్రమాణ స్వీకారం.. 20 మందితో కొత్త మంత్రివర్గం!

VD Satheesan: కేరళ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. దశాబ్దం కాలం (పదేళ్లు) తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) తిరిగి అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన ఆరుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే వి.డి. సతీశన్ కేరళ 13వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్.. సతీశన్ చేత పదవీ స్వీకార, రహస్య విధి నిర్వహణ ప్రమాణాలు చేయించారు. ముఖ్యమంత్రితో పాటు 20 మంది సభ్యుల మంత్రిమండలి కూడా ఈ వేడుకలో ప్రమాణ స్వీకారం చేసింది.

ఈ అట్టహాసమైన కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రత్యేకంగా హాజరయ్యారు. వీరితో పాటు విపక్షాలు అధికారంలో ఉన్న పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేశవ్యాప్త ప్రముఖ రాజకీయ నాయకులు సైతం విచ్చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) రికార్డు హ్యాట్రిక్‌ను అడ్డుకుని యూడీఎఫ్ కూటమి ఘన విజయం సాధించడంతో.. ఈ వేడుకను వీక్షించేందుకు వేలాది మంది యూడీఎఫ్ శ్రేణులు, మద్దతుదారులు స్టేడియానికి తరలివచ్చారు.

ఈ ప్రమాణ స్వీకార వేడుక కేరళ రాజకీయాల్లోని ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య బదిలీ ప్రక్రియకు అద్దం పట్టింది. తాజా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత పినరయి విజయన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ సైతం వేదికపై కాంగ్రెస్ అగ్రనేతలతో కలిసి కూర్చోవడం విశేషం. రాజకీయ వైషమ్యాలు పక్కన పెట్టి నేతలంతా ఒకే వేదికపై కనిపించడం అందరినీ ఆకట్టుకుంది. పదేళ్ల విరామం తర్వాత కేరళ బాధ్యతలు చేపట్టిన వి.డి. సతీశన్ ప్రభుత్వం ఎలాంటి పాలన అందిస్తుందోనని ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story